పవన్ ప్రశ్నపై ‘లోకేష్ సైలెన్స్’..మతలబు ఏమిటో!
మాట్లాడితే చాలు. అవినీతికి ఆధారాలు చూపండి. నిరాధార ఆరోపణలు చేయవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు పదే పదే డిమాండ్ చేస్తారు. కానీ ఎవరైనా స్పష్టంగా..సూటిగా ప్రశ్నలు సంధిస్తే మాత్రం ‘సైలెంట్’ అయిపోతారు. విశాఖపట్నంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములను బహుళ జాతి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు కట్టబెట్టడంతో పాటు ఆ పేరుతో బినామీ సంస్థలను తెరపైకి తెచ్చిన చంద్రబాబు అండ్ నారా లోకేష్ టీమ్ ప్రస్తుతం చిక్కుల్లో పడటం ఖాయంగా కన్పిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నం పర్యటనలో ఒకే ఒక్క సూటి ప్రశ్న వేశారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రధాన కార్యాలయమే పది ఎకరాల్లో ఉంది. ఇదే విషయాన్ని పవన్ ప్రస్తావించారు. అయితే పవన్ పొరపాటున ఐదు ఎకరాలు అన్నారు. అయినా ప్రధాన కార్యాలయం పది ఎకరాల్లో విస్తరించి ఉంటే..బ్రాంచ్ ఆఫీస్ కు 25 ఎకరాలు కేటాయిస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీనికి సూటిగా సమాధానం ఉండదు కానీ..పరిశ్రమలను అడ్డుకోవద్దు...ప్రతిష్టాత్మక సంస్థలపై ఆరోపణలు చేయవద్దు అంటూ కామెడీ డైలాగులు చెబుతున్నారు.
ఈ భూ కేటాయింపులోనే పెద్ద స్కామ్ ఉంది. అసలు కంపెనీ తమకు 25 ఎకరాలు చాలు అని చెపితే ...సర్కారు అబ్బే అదేమి సరిపోతుంది అని ఏకంగా 40 ఎకరాలు ఇవ్వటానికి సిద్ధపడింది. వాస్తవానికి విశాఖపట్నంలోని రుషికొండపై ఇన్నోవా సొల్యూషన్స్ కు 150 కోట్ల రూపాయల విలువ చేసే 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. ఈ విషయాన్ని ‘తెలుగు గేట్ వే’ వెలుగులోకి తేవటం, బిజినెస్ రూల్స్ కు విరుద్దంగా జీవోల జారీపై వార్తలు రాయటంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీన్ లో నుంచి బినామీ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్ ను తప్పించి...ఫ్లాంక్లిన్ టెంపుల్టన్ 25 ఎకరాలు అడిగితే ఆ సంస్థకే 40 ఎకరాలు అప్పగించటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది స్కామ్ కాక మరేమిటో ఐటి మంత్రి నారా లోకేషే చెప్పాలి?.