Telugu Gateway
Andhra Pradesh

‘లోకేష్ రాజ్’తో టీడీపీలో కొత్తపోకడలు

‘లోకేష్ రాజ్’తో టీడీపీలో కొత్తపోకడలు
X

తెలుగుదేశం పార్టీలో ‘లోకేష్ రాజ్’. ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. నారా లోకేష్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఉన్నా...ఎన్నికల వేళ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యూహాత్మక మౌనంతో పార్టీలో కొత్త పోకడలు ప్రారంభం అయ్యాయని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న టీడీపీ సంప్రదాయానికి భిన్నంగా..తాజాగా లోకేష్ టిక్కెట్ల ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఖరారు కూడా లోకేష్ చేతుల్లోకి వెళ్ళటం ఖాయంగా కన్పిస్తోందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా నారా లోకేష్ చేసిన టిక్కెట్లు ప్రకటన ఇందుకు నాందిగా భావిస్తున్నారు. దీనిపై చంద్రబాబు కూడా మౌనంగా ఉండటంతో దీనికి ఆయన ఆమోదం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే లోకేష్ సీనియర్ నేతలకు కూడా ఏ మాత్రం విలువ ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. టిక్కెట్ల వ్యవహారం కూడా ఇక ఆయన చేతికి వెళ్ళిందంటే పార్టీ పరిస్థితి ఎటు మారుతుందో అన్న చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎక్కువ శాతం తన ‘టీమ్’కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా చోట్ల సీనియర్లను పక్కన పెట్టి...వారి వారసులకు..వీలు లేని చోట కొత్త వారికి అవకాశం కల్పించటం ద్వారా పార్టీని పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు లోకేష్ ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని సమాచారం. లోకేష్ కంటే వయస్సులో పెద్దవాళ్ళు అయిన నేతలు కూడా ఇఫ్పటికే ‘సార్.. సార్’ అంటూ లోకేష్ ను సంభోదిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఓ నేత వ్యాఖ్యానించారు.

ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో మార్పులు చాలా ఉంటాయని..అవి ముఖ్యంగా లోకేష్ అభీష్టం ప్రకారమే సాగుతాయని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎడాపెడా పలు పార్టీల నేతలు భారీ ఎత్తున చేర్చుకున్నారు. ఇప్పుడు ఫిరాయింపు నేతలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి చోటు కల్పిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే. ఎన్నికల నాటికి ఈ ఫిరాయింపుల వ్యవహారంలో పార్టీలో పెద్ద ఎత్తున చికాకు చేయటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ వ్యవహారాలు అన్నింటిని చంద్రబాబు, నారా లోకేష్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది వేచిచూడాల్సిందే. నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చేసిన టిక్కెట్ల ప్రకటనను సీనియర్ మంత్రులు కూడా తప్పుపడుతున్నారు. అలా చెప్పటం సరికాదని వీరు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it