కెటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కౌన్సిల్ ఛైర్మన్!

అధికార వర్గాల్లో కలకలం. ఓ మంత్రి పుట్టిన రోజు వేడుకల్లో శాసనమండలి ఛైర్మన్. అసెంబ్లీ కార్యదర్శి. తెలంగాణ ట్రాన్స్ కో, జెక్ కో ఛైర్మన్ ప్రభాకర్ రావులు పాల్గొన్న ఘటన కలకలం రేపుతోంది. అదీ మంత్రి లేకుండా. కౌన్సిల్ ఆవరణలో ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వీరితో పాటు మరికొంత మంది ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఏకంగా కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్, ట్రాన్స్ కో ఛైర్మన్ ప్రభాకర్ రావు, అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులు పాల్గొన్నారు. మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలఉ చెప్పటాన్ని ఎవరూ తప్పుపట్టరు. సమావేశాలు జరుగుతున్న తరుణంలో మంత్రి అక్కడ ఉంటే..ఆయన సమక్షంలో కేక్ కట్ చేసి వేడుక చేయటాన్ని కూడా ఎవరూ అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదు.
కానీ ఆయన లేకుండా ప్రోటోకాల్ లో గవర్నర్ తర్వాత స్థానంలో ఉండే మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఇందులో పాల్గొనటంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ఏకంగా అసెంబ్లీ కార్యదర్శి, ట్రాన్స్ కో, జెన్ కో ఛైర్మన్ ప్రభాకర్ రావు వంటి వాళ్ళు పాల్గొనటం వల్ల ఎలాంటి సంకేతాలు వెళతాయని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోనీ కెటీఆర్ పుట్టిన రోజు వేడుకలను స్వామిగౌడ్ తన నివాసంలో సన్నిహితులతో జరిపినా పెద్దగా అభ్యంతరం ఉండదు కానీ..ఏకంగా కౌన్సిల్ ఆవరణలో ఇలా చేయటం సరికాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం హవా అంతా కెటీఆర్ దే అన్న సంగతి తెలిసిందే. భవిష్యత్ నేతగా పార్టీలో ప్రచారం జరుగుతోంది.