Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ కు ఒక్క ఓటు పెరిగింది

కాంగ్రెస్ కు ఒక్క ఓటు పెరిగింది
X

కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి రాకతో జరిగేది అంతేనా?. ఏమో మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం అంతే అని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరటం వల్ల ఆ పార్టీకి ఏపీలో ఒక్క ఓటు పెరుగుతుంది తప్ప..అంతకు మించి మరే ప్రయోజనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అత్యంత ధనికుడైన రాజకీయ నేత కూడా ఆయనే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది ఎవరైనా ఉన్నారా? అంటే అది కిరణ్ కుమార్ రెడ్డే అని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. ఆయనకు రాహుల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ చీఫ్‌ రఘువీరాతో కలసి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కాంగ్రెస్ లో చేరిక తర్వాత కిరణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే విభజన హమీలు అమలవుతాయని అన్నారు. రాహుల్‌ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. పార్టీ అధిస్టానం ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితేనే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఉంటుందని అన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని చెప్పిన మాట చట్టంతో సమానం అని వ్యాఖ్యానించారు. గత ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉందని అన్నారు.

Next Story
Share it