Telugu Gateway
Andhra Pradesh

కిరణ్ రాక కాంగ్రెస్ కు లాభమా..నష్టమా!

కిరణ్ రాక కాంగ్రెస్ కు లాభమా..నష్టమా!
X

కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. నిన్న మొన్నటివరకూ ఆంధ్రప్రదేశ్ లో అయితే అందరూ ఆయన గురించి మర్చిపోయారు. తెలంగాణలో కనీసం కాంగ్రెస్ ను తిట్టడానికి అయినా సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ వంటి నేతలు కిరణ్ కుమార్ రెడ్డి పేరు తరచూ ప్రస్తావిస్తుంటారు. తెలంగాణ వస్తే విద్యుత్ కొరతతో రాష్ట్రం అంథకారం అయిపోతుందని ప్రజంటేషన్లు ఇచ్చి మరీ సినిమా చూపించారు. కానీ విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ సమస్య మటుమాయం అయింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన దానికి పూర్తి భిన్నంగా జరిగింది. అందుకే పదే పదే కెసీఆర్ ప్రతి బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు తలస్తుంటారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయాలతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీశారు. కరడుగట్టిన సమైక్యవాదిగా కలర్ ఇచ్చిన కిరణ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా నష్టపోవటానికి కారణం అయ్యారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో పడకుండా చేయటంలో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర చాలా ఉంది. పోనీ విభజన అనివార్యం అని తెలిసి..ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి అయినా కేంద్రం నుంచి ఏమైనా ప్రత్యేక ‘ప్రయోజనం’ వచ్చేలా చేశారా? అంటే అదీ లేదు.

అలా రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసిన వారిలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. లాస్ట్ బాల్...లాస్ట్ బాల్ అంటూ చివరి నిమిషం వరకూ ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని ఉన్నారే తప్ప...ఆయన సాధించింది ఏమీ లేదు. ఈ మధ్యే తన సోదరుడిని తెలుగుదేశంలో చేర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటే... కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతిపక్ష వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే పరోక్షంగా దీనికి మద్దతు ఇచ్చి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారు చంద్రబాబు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ మర్చిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ నెల13న ఆయన పార్టీలో చేరటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది.

2014 ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ (జెఎస్పీ) మట్టికరిచిన సంగతి తెలిసిందే. మరి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరితే ఏపీలో లాభం సంగతి ఏమోకానీ...కాస్తో కూస్తో గెలుపు ఛాన్స్ లు ఉన్న తెలంగాణలో అది కాంగ్రెస్ కు నష్టం చేసే అవకాశం ఉందని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల నాటికి టీడీపీ, కాంగ్రెస్ ల పొత్తు ఖరారు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించామని ప్రచారం చేసుకుంటారేమో. చూడాలి ఎన్నికల లోపు ఎన్నెన్ని విచిత్రాలు జరుగుతాయో.

Next Story
Share it