Telugu Gateway
Andhra Pradesh

జగన్ వర్సెస్ పవన్

జగన్ వర్సెస్ పవన్
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇంత కాలం అందరి దాడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఉండగా..ఇప్పుడు రాజకీయం అంతా జగన్ వర్సెస్ పవన్ గా మారింది. అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని..కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తారని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అటు జగన్ పై ..జగన్ కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నిండా ఇదే రచ్చ సాగుతోంది. జగన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. దోపిడీలు చేసేవాళ్ళు..ఇసుక మాఫియాకు..కుంభకోణాలు చేసేవాళ్ళకే అంత ధైర్యం ఉండే...ఏమీ లేని తనకెంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. ధైర్యం ఉంది కాబట్టే తాను ప్రజల్లోకి వచ్చానని వ్యాఖ్యానించారు. పేరు పెట్టకుండా జగన్ ను ఉద్దేశించి ఫ్యాక్షనిస్టులు, గూండాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడిచేస్తామని హెచ్చరించారు పవన్. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేయ‌డానికి వ‌చ్చాననీ, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని చెప్పారు.

తాను వ్య‌క్తిగ‌తంగా మాట్లాడం మొద‌లుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఊహించ‌లేర‌ని, త‌ట్టుకోలేర‌ని, పారిపోతార‌ని అన్నారు. అయితే అలాంటి మాటలతో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని అన్నారు. బుధ‌వారం భీమ‌వ‌రం స‌మీపంలోని నిర్మలాదేవి ఫంక్ష‌న్ హాల్ లో కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "చంద్ర‌బాబు, జ‌గ‌న్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయ‌లేదు. అంబేద్క‌ర్ లాంటి మ‌హానుభావుడికే రాజ్యాంగం రాయగలిగే విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభ‌కోణాలు, దోపిడీలు చేసే వీళ్ల‌కే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్ర‌జా సంక్షేమం కోసం నిల‌బ‌డే నాకు ఎంత తెగింపు ఉండాలి. చూడ్డానికే ప‌వ‌న్ క‌ల్యాణ్ మెత్తగా క‌నిపిస్తాడు.. కానీ తేడా వ‌స్తే తోలు తీస్తాడు. స‌మాజంలో మార్పు తీసుకొస్తున్నాన‌నే భ‌యంతోనే తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ అంద‌రూ న‌న్ను తిడుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంటిస్తంభం మేడలో కూర్చొనే వ్య‌క్తి కాదు. నేల మీద న‌డిచే వ్య‌క్తి అని గుర్తుంచుకోవాలి. రాజ‌కీయాల్లో మాన‌వ‌త్వం చ‌చ్చిపోయింది. మ‌రిచిపోయిన మాన‌వ‌త్వం, జ‌వాబుదారిత‌నాన్నిరాజ‌కీయాల్లో తీసుకురావడానికే జ‌న‌సేన పార్టీ పెట్టా.

రాజ‌కీయాల‌కు వేల‌కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశ‌యం కోసం తెగించే గుణం ఉంటే చాలు. జ‌న‌సేన అటువంటి ఆశ‌యంతో ప్రజా శ్రేయస్సుకు పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.’ సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన తానే ఈ స్థాయికి వ‌స్తే.. బాగా చ‌దువుకున్న మీరు ఏ స్థాయికి వెళ్ల‌గ‌ల‌రో ఊహించుకోవాలి. రాజ‌కీయాల‌కు బ‌ల‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఓపిక కావాలి. ప్ర‌తి జ‌న‌ సైనికుడు వాటిని అల‌వ‌ర్చుకోవాలి. ఒక త‌రంలో మార్పు రావాలంటే 25 ఏళ్లు ప‌డుతుంది. అందుకే నేను 25 ఏళ్లు రాజ‌కీయాలు చేయ‌డానికి వచ్చానని తరచూ చెబుతున్న. 5 ఏళ్లు గ‌ట్టిగా క‌ష్ట‌బ‌డితే ముఖ్య‌మంత్రి మంత్రి సీటులో కూర్చొవ‌చ్చు కానీ దానివ‌ల్ల స‌మాజంలో మార్పు రాదు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి" అన్నారు. జగన్ విమర్శలు...పవన్ కళ్యాణ్ కౌంటర్ లకు తోడు సోషల్ మీడియాలో మాత్రం రెండు పార్టీలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

Next Story
Share it