జె సీ రాజీనామా కూడా అలాంటిదేనా?
తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి మాట మార్చారు. పార్లమెంట్ కు హాజరు అయ్యేదిలేదు..ఓటింగ్ లో పాల్గొనేది లేదని బెదిరించిన ఆయన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ తో అన్నీ తూచ్ అన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ‘రాజీనామా’ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొని..తర్వాత రాజీనామా విషయంపై ప్రకటన చేస్తానని తెలిపారు. దీంతో టీడీపీలో కొత్త సమస్య వచ్చినట్లు అయింది. అదను చూసుకుని జెసీ చంద్రబాబును బెదిరిస్తున్నారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జె సీ తీరుతో ఇఫ్పటికే పార్టీకి జరగాల్సినంత డ్యామేజ్ జరిగిపోయిందని..ఇప్పుడు ఎన్ని రిపేర్లు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
అనంతపురం జిల్లాలోని టీడీపీ నేతలతో జెసీకి ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చినా జెసీ పెత్తనం జిల్లాలో బాగానే సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని టిక్కెట్ల విషయంలో పేచీ వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సరిగ్గా టైమ్ చూసుకుని జెసీ ఇచ్చిన ఝలక్ లు పార్టీ పరువు తీశాయి. అదే సమయంలో చంద్రబాబు పరిస్థితిని బహిర్గతం చేశాయని అంటున్నారు. మరి శుక్రవారం సాయంత్రం జెసీ ఎలా ప్రకటన చేస్తారో వేచిచూడాల్సిందే. ఈ రాజీనామా కూడా అవిశ్వాసంలో పాల్గొనను..విప్ ఇఛ్చినా డోంట్ కేర్ అన్నట్లే ఉంటుందా?. లేదా చూడాల్సిందే.