టీడీపీకి జెసీ దివాకర్ రెడ్డి షాక్
లోక్ సభలో ‘అవిశ్వాస తీర్మానం’పై చర్చకు ఆమోదం లభించటమే పెద్ద విజయంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి షాక్. అవిశ్వాస తీర్మానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని..పార్టీ విప్ జారీ చేసినా తాను లోక్ సభ సమావేశాలకు హాజరుకాబోనని ఆ పార్టీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ అవిశ్వాస తీర్మానంతో మోడీ ప్రభుత్వం ఏమీ పడిపోదని..వాళ్లకు ఉన్న మెజారిటీతో తాము చేయగలిగింది ఏమీ లేదని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ ఓ వైపు ఈ అవిశ్వాస తీర్మానాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు హంగామా చేస్తుంటే...సొంత పార్టీ ఎంపీనే టీడీపీ పరువు తీసేలా వ్యవహరించటం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి చేసే వ్యాఖ్యలు టీడీపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.
కడపలో ఎంపీ సీఎం రమేష్ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తే..ఈ దీక్షతో ఉక్కూ రాదు..తుక్కు రాదూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంపై చర్చ కూడా వేస్ట్..దీని వల్ల ఒరిగేది ఏమీలేదంటూ తేల్చేశారు. ఇది టీడీపీ అధిష్టానానికి ఇరకాట పరిస్థితే. ఓ వైపు పట్టుపట్టి అవిశ్వాసం తీర్మానానికి సభలో ఆమోదింపచేసుకుంటే సొంత ఎంపీనే పార్టీ నిర్ణయాన్ని డోంట్ కేర్ అనటం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు జెసీ దివాకర్ రెడ్డిని చంద్రబాబు ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కన్పిస్తోందని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.