Telugu Gateway
Andhra Pradesh

గంటా పోటీ ఈ సారి విజయనగరం నుంచి!

గంటా పోటీ ఈ సారి విజయనగరం నుంచి!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారటం ఖాయమా?. అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ వర్గాల నుంచి. ఆయన ఈ సారి పార్టీ మారటం ఖాయం...అదే సమయంలో జిల్లా మారటం కూడా ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి మాత్రం ఏకంగా జిల్లా మారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖపట్నంలో తనకు శత్రువులు పెరగటంతోపాటు..పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున ఆయన ‘సేఫ్ జోన్’గా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఈ సారి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనలోకి వెళతారా? లేక ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వెళతారా? అన్నది అప్పటి పరిస్థితులను బట్టే ఉంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు కూడా గంటా వైసీపీకి వెళ్ళేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించి...చివరకు టీడీపీలోకి దూకారు. ఈ విషయం పార్టీ అధినేతకు కూడా తెలుసని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య దూరం పెరిగింది.

పైకి సయోధ్య కుదిరినట్లు కన్పిస్తున్నా..లోలోపల మాత్రం పరిస్థితి అంతే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా సర్వశిక్షా అభియాన్ కు సంబంధించిన 4000 కోట్ల రూపాయల పనుల విషయంలో చంద్రబాబు, గంటాల మధ్య విభేదాలు తలెత్తాయని ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్నందున చివరి వరకూ కొనసాగి..ఎన్నికలకు రెండు నెలల ముందు గంటా అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు కూడా గంటా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. విశాఖ భూ కుంభకోణంలో గంటా పేరు ప్రముఖంగా విన్పించినా..సిట్ నివేదికలో ఆయన పేరు లేదని..అందుకే ఈ నివేదిక బహిర్గతం చేయలేదని గంటా ఆరోపిస్తున్నారు.

Next Story
Share it