Telugu Gateway
Andhra Pradesh

ఈనాడుకు అవమానం..4848 కోట్ల ‘సర్వ దోపిడీ అభియాన్’ టెండర్లు రద్దు

ఈనాడుకు అవమానం..4848 కోట్ల ‘సర్వ దోపిడీ అభియాన్’ టెండర్లు రద్దు
X

అక్రమాల టెండర్లను కూడా అహో...ఓహో అంటూ కీర్తించింది ఈనాడు. అందులో భారీ కుంభకోణం ఉన్నా..అది కాస్తా కవర్ చేస్తూ స్కూళ్ళకు మౌలిక కళ అంటూ హంగామా చేసింది. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో టాయిలెట్లు ఉన్నాయని కేంద్రానికి ఓ వైపు నివేదిక ఇచ్చి..మరోవైపు కొత్తగా రాష్ట్రంలోని 20వేలకు పైగా స్కూళ్ళలో టాయిలెట్లు లేవని..కొత్తగా కడుతున్నట్లు దోపిడీకి తెరలేపారు. ‘తెలుగు గేట్ వే.కామ్’ సర్వశిక్షా అభియాన్ లో జరుగుతున్న అడ్డోగోలు దోపిడీని ‘సర్వ దోపిడీ అభియాన్’ పేరుతో వెలుగులోకి తెచ్చింది. వాస్తవాలను విస్మరించి ఈనాడు దీనికి అందించిన పరోక్ష సహకారాన్ని కూడా అందులో ప్రస్తావించింది. అసలు దోపిడీ..దీనికి తోడు అధిక ధరలతో టెండర్లు. దీంతో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ 4848 కోట్ల రూపాయల టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే స్కామ్ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వంపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. నిజంగా ఈ విషయంలో టెండర్లను ఓకే చేసి..ముందుకెళ్ళి ఉంటే ఏదైనా విచారణ జరిగితే అధికారులతోపాటు అందరూ చిక్కల్లో పడేవారని ప్రభుత్వ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

టెండర్ల రద్దుకు సంబంధించి మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన సారాంశం..‘ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఎలాంటి మౌలిక వ‌సతుల కొర‌త లేకుండా తీర్చిదిద్దేందుకే హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.4848 కోట్లు ఖ‌ర్చు చేయనున్నామ‌ని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ మొత్తంతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 100 శాతం మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తామ‌ని అన్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఈ విధానంలో గుత్తేదార్లు టెండ‌ర్ల‌ను ప్రీమియం రేట్ల‌ కంటే ఎక్కువ‌గా కోట్ చేశార‌ని, దీనివ‌ల్ల ప్ర‌భుత్వంపై ఎక్కువ భారం ప‌డే అవ‌కాశం వుంద‌ని అందువ‌ల్లే ఈ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌కు మంత్రి గంటా ఆదేశాలు జారీ చేశారు. త్వ‌ర‌లోనే మ‌రోసారి టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తామ‌ని మంత్రి గంటా చెప్పారు. దేశంలోనే మొద‌టిసారి పాఠ‌శాల విద్యాశాఖ‌లో హైబ్రిడ్ యాన్యుటి విధానాన్ని అమలు చేస్తున్నామ‌ని, వినూత్న ఆలోచ‌న‌లతో ముందుకు సాగుతున్నాం అన‌డానికి ఇదొక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేయాల‌న్న‌దే త‌మ ఆకాంక్ష అని, ఈ క్ర‌మంలోనే ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళుతున్నామ‌ని అన్నారు. పాఠ‌శాల్లో ఇప్ప‌టికే వ‌ర్చువ‌ల్, డిజిట‌ల్ త‌ర‌గతులు ప్రారంభించామ‌ని, ఎన్న‌డూ లేని స్థాయిలో ఉపాధ్యాయుల‌ను నియ‌మించామ‌ని, మ‌రోసారి డీఎస్సీ కూడా వేయ‌నున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ బ‌డులు బ‌లోపేతానికి అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి గంటా పేర్కొన్నారు. హైబ్రిడ్ యాన్యుటి విధానంలో పాఠ‌శాల‌ల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం కోసం గుత్తేదార్ల నుంచి టెండ‌ర్ల‌ను ఆహ్వానించామ‌ని మంత్రి గంటా తెలిపారు. గుత్తేదార్లు ప్రీమియం రేట్ల‌ కంటే ఎక్కువ రేట్ల‌కు టెండ‌ర్లు కోట్ చేశార‌ని అన్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి అద‌న‌పు భారం ప‌డే అవ‌కాశం వుంద‌ని, అందుకే ఈ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోసారి టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తామ‌ని, హైబ్రిడ్ యాన్యుటి విధానంలో పాఠ‌శాల్లో మౌలిక స‌దుపాయాలు క‌ల్సిస్తామ‌ని అన్నారు. ’ ఇదిలా ఉంటే ఓ వైపు వేల స్కూళ్ళలో అసలు విద్యుత్ సౌకర్యమే లేదని చెబుతూ..మరో వైపు మంత్రి వర్చువల్..డిజిటల్ క్లాస్ లు నిర్వహిస్తున్నామని చెప్పటం విశేషం.

Next Story
Share it