Telugu Gateway
Andhra Pradesh

రాహుల్ దెబ్బకు తేలిపోయిన గల్లా

రాహుల్ దెబ్బకు తేలిపోయిన గల్లా
X

‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ చేసింది ఏమైనా ఉందీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేయటమే. శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన చర్చ తీరు చూసిన వారెరికైనా ఇదే భావన కలగటం సహజం. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దెనెక్కకుండా చేస్తామని...కర్ణాటకలో చూసింది శాంపిల్ మాత్రమే అన్న చంద్రబాబు, నారా లోకేష్ లు భీషణ ప్రతిజ్ణలు అవిశ్వాస తీర్మానం వచ్చేసరికి తేలిపోయాయి. ఇదేదో టీడీపీ-బిజెపి మధ్య పోటీగా చూడొద్దంటూ వ్యాఖ్యానించారు గల్లా జయదేవ్. మరి పోరాటం బిజెపిపై కాకపోతే ఎవరిపై చేస్తున్నట్లు? గల్లా జయదేవ్ తన ప్రసంగంలో ప్రదాని మోడీ కంటే ఎక్కువ ఆర్థిక మంత్రి సాయం చేయటం లేదనే మాట్లాడటం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా జయదేవ్ తన ప్రసంగాన్ని తన బావమరిది మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’తో మొదలుపెట్టగానే ఆయన వెనకే ఉన్న టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ..చేయి చూపించిన దృశ్యాలు టీవీలో స్పష్టంగా కన్పించాయి. అయితే గల్లా జయదేవ్ సినిమాలో ఉన్న ‘హామీని నిలబెట్టుకోలేని వ్యక్తి మనిషే’ కాదు అన్న అంశాలను ప్రస్తావించారు.

అదే సమయంలో జయదేవ్ గత కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన విగ్రహాల లెక్కలు..ఇతర లెక్కలు చెప్పారో తప్ప..జయదేవ్ ప్రసంగం ఏమీ ‘కొత్తదనం’ చూపించలేకపోయింది. ఇది మెజారిటీ, మొరాలిటీ మధ్య పోరాటం అంటూ అభివర్ణించారు. అయితే గల్లా జయదేవ్ తర్వాత మాట్లాడిన రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, బిజెపిపై తీవ్ర విమర్శలు చేస్తూ దాడికి దిగారు. శాంతంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రభుత్వ వైఫల్యాలను, రాఫెల్ డీల్ కుంభకోణాన్ని, అమిత్ షా తనయుడి అక్రమ దందాతోపాటు పలు అంశాలను ప్రస్తావించారు.. బిజెపి నేతల్లో అధికారంలో పోతుందనే భయం కన్పిస్తోందని...అందుకే వారు వ్యవస్థలపై దాడి చేస్తున్నారని..వ్యక్తిగతంగా తనపై విమర్శలు చేసినా తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు.

ప్రదాని నరేంద్రమోడీ సభలో పైకి నవ్వుతూ కన్పిస్తూ...లోపల మాత్రం భయం కన్పిస్తోందని ఎద్దేవా చేశారు. బిజెపి వైఫల్యాలను రాహుల్ సమర్థవంతంగా సభలో విన్పించారు. అవిశ్వాస తీర్మానంపై తన ప్రసంగం ముగిసిన రాహుల్ నేరుగా ప్రధాని దగ్గరికి వెళ్లి...ఆయనకు షేక్ హ్యాండ్ ఇఛ్చి..ఆలింగనం చేసుకోవటం కలకలం రేపింది. ప్రధాని మోడీ కూడా ఈ పరిణామంతో అవాక్కు అయ్యారు. రాహుల్ తన ప్రసంగంలో గల్లా జయదేవ్ ప్రసంగం ఆవేదనతో కూడుకుని ఉందని వ్యాఖ్యనించటం విశేషం.

Next Story
Share it