అవిశ్వాసానికి ముందే చేతులెత్తేసిన టీడీపీ
ఓ వైపు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నాం అని చెబుతారు. మరో వైపు ప్రధాని మోడీపై బిజెపి ఎంపీలే కోపంగా ఉన్నారు..కాబట్టి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారు అని చెబుతారు. కానీ వాస్తవం ఏంటో తెలిసి వచ్చినట్లు ఉందని తెలుగుదేశం పార్టీకి. అందుకే అవిశ్వాసానికి ముందే చేతులెత్తేసింది. తమ ఉద్దేశం మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని..మోడీ సర్కారుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని తమకు తెలుసు అని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా గల్లా వ్యాఖ్యలతో జరగబోయేది ఏమిటో స్పష్టం అయింది. అయితే ఓ వైపు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపీలు అందరికీ లేఖలు రాశారు. తమకు మద్దతు ఇవ్వాలని..అవిశ్వాసాన్ని బలపర్చాలని. టీడీపీ ఎంపీల టీమ్ లు పలు పార్టీల నేతలను కలసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మరి ఇదంతా ఎందుకు చేసినట్లు. సభలో కేవలం ఏపీకి జరిగిన అన్యాయం గురించి చెప్పటానికి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు కదా?. స్పీకర్ కేటాయించిన సమయం ప్రకారం తెలుగుదేశం సభ్యులైనా..ఎవరైనా తమ వాదన విన్పించుకోవచ్చు. అసలు టీడీపీ పెట్టిన అవిశ్వాసంతో మోడీ సర్కారు పడిపోతుందనే స్థాయిలో కలరింగ్ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు మాత్రం కూల్ గా మా ఉద్దేశం సర్కారును పడగొట్టడం కాదు అని చెప్పటం ద్వారా ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు ప్రజలకు?. అవిశ్వాస తీర్మానంపై చర్చ. ఓటింగ్ కు ముందే టీడీపీ ఎంపీలు ఇలా ప్రకటించటం సెల్ప్ గోల్ కొట్టుకున్నట్లే ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.అందులో శుక్రవారం నాడు టీడీపీ తరపున లోక్ సభలో చర్చను ప్రారంభించనున్న గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేయటం టీడీపీని ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది.