Telugu Gateway
Andhra Pradesh

ఎల్ఈపీఎల్ తో చంద్రబాబు 14 వేల కోట్ల ‘ఉత్తుత్తి ఎంవోయులు’

ఎల్ఈపీఎల్ తో  చంద్రబాబు 14 వేల కోట్ల ‘ఉత్తుత్తి ఎంవోయులు’
X

పరిశ్రమల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘దొంగాట’ ఇది. రాష్ట్రానికి వచ్చేది అరకొర..చంద్రబాబు చెప్పుకునేది మాత్రం ఆకాశమంత. విజయవాడకి నివాసం మార్చగానే లింగమనేని ఎస్టేట్స్ కు చెందిన అక్రమ నివాసాన్ని తన నివాసంగా మార్చుకున్న చంద్రబాబు..అదే గ్రూప్ తో పలు ‘ఉత్తుత్తి’ ఎంవోయులు చేయించారు. ఉత్తుత్తి ఎంవోయులు అని ఎందుకు అంటున్నాం అంటే..సుమారు 14 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ఎంవోయుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు లేవు. భవిష్యత్ లో పడే అవకాశం కూడా లేదని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. భాగస్వామ్య సదస్సుల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి చేసుకున్నది చాలా వరకూ ఇలాంటి ‘ఉత్తుత్తి ఎంవోయులే’. 2016 జూన్ లో చంద్రబాబు సర్కారు చైనాకు చెందిన హుంక్విన్ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఎల్ ఈపీఎల్ వెంచర్స్, ఇసోమెరిక్ హోల్డింగ్స్ తో ఎంవోయు చేసుకుంది. దీని ప్రకారం ఆ సంస్థలు అన్నీ కలిపి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర10183 కోట్ల పెట్టుబడితో ఫెర్టిలైజర్స్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి.

ఈ ప్రాజెక్టు వాణిజ్య ఉత్పత్తి 2017-18లోనే ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఐదు వేల ఉద్యోగాలు వస్తాయని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయమే తెలిపింది. చూస్తే ఇంత వరకూ ఒక్కఅ డుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ఇదే ఎల్ ఈపీఎల్ వెంచర్స్ ఏపీ ప్రభుత్వం 2016 జనవరిలో మరో ఎంవోయు చేసుకుంది. దీని ప్రకారం పాన్ ఇండియా పర్యాటన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలసి 800 కోట్ల రూపాయల పెట్టుబడితో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంల్లో అమ్యూజ్ మెంట్, వాటర్ వరల్డ్ పార్క్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎంవోయులు అయితే జరిగాయి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ముందుకు సాగలేదు. ఎల్ ఈపీఎల్ గ్రూపుతో ఇది మూడవ ఒప్పదం.

ఇసోమెరిక్ హోల్డింగ్స్, ఎల్ ఈపీఎల్ వెంచర్స్ కృష్ణపట్నం పోర్టు దగ్గర ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీ గ్యాసిఫికేషన్ (ఎఫ్ఎస్ఆర్ యు) యూనిట్ ఏర్పాటు చేస్తాయని సర్కారు ప్రకటించింది. ఈపెట్టుబడి మొత్తం ఎంత అనుకుంటున్నరా?. అక్షరాలా 3000 కోట్ల రూపాయలు. ఇదీ అమలుకు నోచుకోలేదు. అడ్డగోలుగా ఎంవోయులు చేసుకుని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు..భారీ ఎత్తున ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడమే తప్ప..అమలులో మాత్రం ఏమీ లేదు. ఇలాంటి ‘ఉత్తుత్తి ఎంవోయు’లతో చంద్రబాబు కొత్త రికార్డులు నెలకొల్పటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it