ఏపీ ఫస్ట్..తెలంగాణ సెకండ్
ఆంధ్రప్రదేశ్ కు మొదటి ర్యాంక్. తెలంగాణకు రెండవ ర్యాంక్. ఎందులో అనుకుంటున్నారా?. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలుగు రాష్ట్రాలు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. గతంలోనూ ఈ ర్యాంకు కోసం తెలంగాణ, ఏపీ పోటీ పడ్డాయి. సులభతర వ్యాపారానికి అనువైన ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తుంటుంది. ఈ జాబితాలో హర్యానా మూడవ స్ధానంలో, నాల్గవ స్థానంలో జార్ఖండ్, ఐదవ ప్లేస్ లో గుజరాత్ నిలిచిందని డీఐపీపీ వెల్లడించింది.
గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర స్ధానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి రెండో స్దానంలో నిలిచింది. సంస్కరణల ఆధారిత స్కోర్, ఫీడ్‌బ్యాక్ స్కోర్‌ను క్రోడీకరించిన అనంతరం తుది ర్యాంకులను ప్రకటించారు. పలు స్టీల్ ప్లాంట్లు, బొగ్గు, ముడి ఇనుము గనులను కలిగిన జార్ఖండ్ సంస్కరణల ఆధారిత స్కోర్‌ను నూరు శాతం సాధించిందని డీఐపీపీ తెలిపింది. సంస్కరణల ఆధారిత స్కోర్ తక్కువగా నమోదు చేయడంతో మహారాష్ట్ర 13వ ర్యాంక్, తమిళనాడు 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి.