దుగరాజపట్నం పోర్టును అడ్డుకుంటున్న ‘బిగ్ బాస్’!
ఏపీ ప్రభుత్వంలోని పెద్దలకే రాష్ట్రంలో ఓ భారీ ఓడరేవు రావటం ఇష్టం లేదా?. ఒకప్పుడు దూరంగా ఉండి..ఇప్పుడు అస్మదీయ కంపెనీగా మారిన ఓ ప్రైవేట్ సంస్థకు మేలు చేసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకుందా?. అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వ వ్యయంతోనే నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంలో భారీ ఓడరేవును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇక్కడ ఓడరేవు లాభదాయకం కాదనే నివేదికను ఇఫ్పించటంలో కూడా ఏపీ ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది అంతా కూడా తమ అస్మదీయ జాబితాలో ఉన్న ఓ ఓడరేవు సంస్థకు మేలు చేసి పెట్టడం కోసమేనని చెబుతున్నారు. అంతే కాదు.. రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాన్ని అంతా ఆ సంస్థకే ధారాదత్తం చేసి...పోటీ లేకుండా చేయటానికే ఇదంతా చేస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థకు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే దుగరాజుపట్నం ఓడరేవు నివేదిక కూడా ప్రతికూలంగా రావటంతో కేంద్రం కూడా వెనక్కిపోయింది. ఇదంతా ఓ పథకం ప్రకారం చేశారు. పోనీ అక్కడ లాభదాయకం కాకపోతే ఇక ఏపీలో ఎక్కడా భారీ ఓడరేవుకు సరైన ప్రాంతాలే లేవా?. ఓడరేవు అభివృద్ధికి కేంద్రం ఓ వైపు మేం రెడీ అని చెబుతున్నా...సర్కారు ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేకపోతోంది. ఓ వైపు విభజన హామీలు అమలు చేయటంలేదని గగ్గోలు పెడుతూ..మరో వైపు చేస్తామన్న వాటిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. దుగరాజపట్నంలో లాభదాయకం కాదని చెబుతున్నారు కదా? మరి ఏదైనా ప్రత్యామ్నాయ ప్రాంతం చూపించండి. అక్కడ ఓడరేవును అభివృద్ధి చేస్తాం అని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ దుగరాజపట్నంకు ప్రత్యామ్నాయమైన స్థలాన్ని చూపించటంలో విఫలమైంది.
తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాడరేవు ప్రాంతంలో పోర్టు అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తే...అక్కడ ఎవరైనా చేస్తారు?. కేంద్రం ఎందుకు? అనే తరహాలో ప్రభుత్వంలోని పెద్దలే వ్యాఖ్యానించటం విశేషం. అంటే ఏతా వాతా ఏపీలో కొత్త పోర్టు వస్తే తమ అస్మదీయ సంస్థ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది కాబట్టి...ప్రభుత్వమే ఏకంగా విభజన చట్టంలో పెట్టిన.. చట్టబద్దంగా ఏపీకి రావాల్సిన పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం చూపించకుండా చేయటం విస్మయగొలిపే అంశం అని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వంలోని పెద్దలు గతంలో ఎన్నడూలేని రీతిలో స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శులు ఎదుర్కొంటున్నారు.