అందమైన అమ్మాయిలను చూపొద్దు
ఎవరైనా అందం చూడవయా...ఆనందించవయా అంటారు. కానీ ఇదెక్కడి విచిత్రమో కానీ..అందమైన అమ్మాయిల వైపు కెమెరా తిప్పారంటే మాత్రం ఊరుకోం అని వార్నింగ్ ఇస్తున్నారు అక్కడ. భారత్ లో క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు కూడా హుషారుగా...అందంగా ఉండే అమ్మాయిల వైపు కెమెరాలు ఆటోమేటిక్ గా వెళ్లిపోతుంటాయి. క్రికెట్ ను ఆస్వాదించటంతో పాటు...ప్రేక్షకులు అప్పుడప్పుడు కెమెరా వాళ్ల క్రియేటివిటితో అందమైన అమ్మాయిలను కూడా చూసి ఆనందిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. టీవీల్లో తాము కనపడగానే అమ్మాయిలు కూడా చాలా హుషారుగా చేతులూపుతూ ఎంజాయ్ చేస్తారు. ఉంటే గింటే అమ్మాయిలకు ఉండాలి కానీ అభ్యంతరాలు వాళ్లకెందుకు? అంటారా?. అచ్చం ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం పలు దేశాలను ఫిపా ప్రపంచ కప్ ఊపేస్తోంది. ఈ అందమైన అమ్మాయిల పంచాయతీ కూడా అక్కడే వచ్చింది. రష్యాలో అందగత్తెలు ఎక్కువ. అందులోనూ ఒక్కొక్కరు ఆరడుగులుపైనే ఉంటారు. దీంతో ప్రేక్షకులు కళ్లు తిప్పుకోకుండా వాళ్లను చూస్తూ ఉంటారు.
సహజంగా కెమెరామెన్ల పనే అది కదా...అందం ఎక్కడ ఉంటే కెమెరా అటువైపే వెళుతుంది.అయితే ఫిపా నిర్వాహకులు మాత్రం ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ మారిపోయింది. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో బ్రాడ్కాస్టర్లు సెక్సీ అమ్మాయిలను పదేపదే చూపిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని, దీనికి ఫిఫా వ్యతిరేకమని నిర్వాహకులు స్పష్టం చేశారు. టెలివిజన్‌ల తీరుపై ఫిఫా బాస్ ఫెడెరికో అడెక్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిని ఫిఫా ఉపేక్షించబోదని, వీటిపై ఓ విధానం రూపొందించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రష్యాలో అభిమానుల ప్రవర్తనను పర్యవేక్షించటానికి ఫేర్ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైరా పవర్ తెలిపారు. సెక్సీజమ్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓ సమస్యగా మారిందన్నారు.