Telugu Gateway
Offbeat

ముంబయ్-గోవా మధ్య క్రూయిజ్ సేవలు

ముంబయ్-గోవా మధ్య క్రూయిజ్ సేవలు
X

దేశంలోనే తొలిసారి ముంబయ్-గోవా మధ్య క్రూయిజ్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఆగస్టు 1 నుంచే ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ముంబయ్ పోర్టు ట్రస్ట్, మరో ప్రైవేట్ సంస్థ కలసి సంయుక్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి తేనున్నాయి. దేశంలోనే తొలి క్రూయిజ్ సర్వీసులు ఇవే కావటం విశేషం. ఈ సర్వీసులతో దేశీయ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కటం ఖాయంగా కన్పిస్తోంది. ముంబయ్-గోవాల మధ్య ప్రయాణించే క్రూయిజ్ లో 500 మంది ప్రయాణికులు పడతారు. ఇందులో ప్రయాణికులకు ఆరు కేటగిరీల సౌకర్యాలు ఉంటాయి. ఇందులో టిక్కెట్ ప్రారంభ ధరే 7500 రూపాయలుగా నిర్ణయించారు. గోవా నుంచి ముంబయ్ కు నిత్యం వేలాది పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. కాకపోతే క్రూయిజ్ ఛార్జీలు మాత్రం విమాన ఛార్జీల కంటే అధికంగా ఉండటంతో ఏ మేరకు దీనికి ఆదరణ లభిస్తుందో అన్న అంశంపై వేచిచూడాల్సిందే. అయితే నిర్వాహకులు మాత్రం క్రూయిజ్ పర్యాటకులు మాత్రం ..అందులో ఉండే అనుభూతుల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటారని నమ్మకంతో ఉన్నారు.

ముంబయ్-గోవా మధ్యలో ప్రయాణించే వారు అందులో స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. అందులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రెస్టారెంట్లు కూడా ఉంటాయి. 7500 రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా క్రూయిజ్ నిర్వాహకులే చూసుకుంటారు. క్రూయిజ్ ప్రయాణం ద్వారా పర్యాటకులు కొంకణ్ తీరప్రాంత సుందర దృశ్యాలను వీక్షించే వెసులుబాటు దక్కనుంది. అయినా దేశంలో తొలి క్రూయిజ్ సర్వీస్ ఇదే కావటంతో ఆదరణ లభించటం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు నిర్వాహకులు. భవిష్యత్ లో క్రూయిజ్ లోనే పెళ్ళిళ్ళతో పాటు..ఇతర పార్టీలకు సౌకర్యాలు అందించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. విదేశాలకు పోకుండా ఒక్కసారైనా క్రూయిజ్ అనుభవం పొందాలనుకునే పర్యాటకులకు ఇది ఓ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముంబయ్ లో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరే క్రూయిజ్..ఉదయం తొమ్మిది గంటలకు గోవా చేరుకుంటుంది.

Next Story
Share it