ఆ ఛానల్ సీఈవో దెబ్బకు అందరూ హడల్
అదొక మీడియా ఛానల్. ఐదు నెలలుగా జీతాలు లేవు. అక్కడ పనిచేసే ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అందరి కష్టాలు చెప్పే ఆ ఛానల్ లో వారి కష్టాలు తీర్చేవారే కరువయ్యారు. ఐదు నెలల నుంచి జీతాలు రాకపోవటంతో బతుకు బండి ఈడ్చటం కష్టమైపోయిన ఓ ఉద్యోగి భవనం ఎక్కి దూకే ప్రయత్నం చేస్తే..అదృష్టవశాత్తూ అది చూసిన సహోద్యుగులు చూసి అడ్డుకున్నారు. బిల్డింగ్ నుంచి దూకేందుకు నిర్ణయించుకున్న తమ సహోద్యోగిని చూసిన వారంతా షాక్ కు గురై..వెంటనే ధర్నాకు దిగారు. జర్నలిస్టు యూనియన్లు కూడా రంగంలో దిగాయి. అయినా ఇంత వరకూ పెద్దగా ఫలితం ఉన్న దాఖలాలు లేవు. కానీ ఆ ఛానల్ లో అంతా తానై నడిపిస్తున్న ఓ టాప్ లెవల్ ఉద్యోగి అరాచకం చూసి జిల్లా రిపోర్టర్లు గగ్గోలు పెడుతున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో ఆ ఉద్యోగి జిల్లాల టూర్లు పెట్టుకుంటున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధులతో సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లాల రిపోర్టర్లదే. అయితే ఈ మీటింగ్ లో మాత్రం రిపోర్టర్లకు చోటు కూడా ఉండదు. ఆ బేరాలు అన్నీ ఆమే చూసుకుంటారు. అంతే కాదు..ఆమె పర్యటనకు ప్రతి జిల్లాలో ఓ రిచ్ లుక్ ఉండే కారు ఏరేంజ్ చేయాలి. సకల సౌకర్యాలు కల్పించాలి. ఆ జిల్లాకు విమాన సౌకర్యం ఉంటే టిక్కెట్లు బుక్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ జిల్లా రిపోర్టర్ దే. విమాన సౌకర్యం లేని వాళ్ళు ఫస్ట్ క్లాస్ ట్రెయిన్ టిక్కెట్ బుక్ చేయాలి. ఇదీ ఆమె దందా.
ఎవరైనా ఆమె కోరుకున్నట్లు చేయకపోతే వెంటనే తొలగింపు ఆదేశాలు. ఈ ఎన్నికల సీజన్ లో కోట్ల రూపాయల బిజినెస్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పటంతో యాజమాన్యం కూడా ఆమె గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. దీంతో జిల్లా రిపోర్టర్లు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఐదు నెలల నుంచి జీతాలు లేని పరిస్థితుల్లో రిపోర్టర్లు ఆమె పర్యటనలకు కార్లు..విమాన టిక్కెట్లు సమకూర్చాల్సి రావటం పెద్ద కష్టంగా మారిందని గగ్గోలు పెడుతున్నారు. పోనీ ఉద్యోగం మానేసి పోదామంటే రావాల్సిన ఐదు నెలల జీతాలు ఓ వైపు. ఆ ఛానల్ లో ఉన్న చేతివాటం రిపోర్టర్లకు పెద్దగా ఇబ్బంది ఏమీలేదు కానీ..కేవలం జీతాలపై ఆధారపడిన వారికి మాత్రమే ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు. జీతాల కోసం ఉద్యోగులు ధర్నాకు దిగితే ..ఇలా చేస్తే లాకౌట్ చేయాల్సి వస్తుందని యాజమాన్యంతో సంబంధం లేకుండానే ఆమె హెచ్చరించినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఒకప్పుడు ఈ ఛానల్ ఏపీ ప్రభుత్వ పెద్దల చేతిలో ఉండేది.