Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు కాంగ్రెస్ ను క్షమించేశారు!

చంద్రబాబు కాంగ్రెస్ ను క్షమించేశారు!
X

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించారో లేదో తెలియదు కానీ..తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం క్షమించేసినట్లే కన్పిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరస పెట్టి కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు రాజ్యసభలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వారిపై ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించాయని ప్రకటించారు. తాజాగా శనివారం నాడు ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో కూడా చంద్రబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ తన తప్పు తెలుసుకుని టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ను అప్పట్లో చంద్రబాబు తిట్టని తిట్టు లేదు. కొద్ది కాలం క్రితం ఏపీకి రాహుల్ గాంధీ పర్యటనకు వస్తే కూడా నల్ల జెండాలతో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయించారు.

అయితే చంద్రబాబు వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. రాష్ట్ర విభజన చేసి తప్పు చేశామని కాంగ్రెస్ చెప్పిందా?. ఆ మాట ఎక్కడా అనలేదే?. మరి చంద్రబాబు కాంగ్రెస్ ఏ తప్పు తెలుసుకుని చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది?. కాంగ్రెస్ పార్టీ తరపున కూడా చంద్రబాబే అధికారిక ప్రకటనలు చేస్తారా?. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ పార్టీతో పొత్తుకు తహతహలాడుతున్నందునే చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంత మంది కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెండు పార్టీల పొత్తు ఓకే అయితే తెలంగాణలో ఈజీగా అధికారంలోకి రావచ్చని తెలంగాణ ప్రాంత నేతల అంచనా.

Next Story
Share it