Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబూ..మీ ‘సెంబ్ కార్ప్’ చీటింగ్ చూశారా!

చంద్రబాబూ..మీ ‘సెంబ్ కార్ప్’ చీటింగ్ చూశారా!
X

సింగపూర్ కంపెనీలు అద్భుతం. వాటిలో అవినీతి ఉండదు. అక్రమాలు ఉండవు. నన్ను చూసి..నా క్రెడిబులిటీ చూసి ఈ ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీ రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చేసిన వ్యాఖ్యలు. కానీ సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ వేదికగానే అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి సంస్థల్లో ఒకటైన సెంబ్ కార్ప్ చేసిన చీటింగ్ ఇది. కేవలం మత్సకార కుటుంబాలపై లక్షల రూపాయల వ్యయం చేయాల్సి వస్తుందని..కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అబద్ధాలు చెప్పి ‘మినహాయింపులు’ పొందాలని చూసింది. కానీ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తరచి చూస్తే అసలు విషయం వెలుగు చూసింది. మరి ఇలాంటి కంపెనీలు అమరావతిలో ఎన్ని అక్రమాలకు తెరతీస్తాయో వేచిచూడాల్సిందే. ఇప్పుడు ఈ సంస్థ అక్రమాలకు చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారో?. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నివేదికతో సింగపూర్ కంపెనీ అసలు బండారం బయటపడింది. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసే సంస్థల్లో సింగపూర్ కు చెందిన సెంబ్ కార్ప్ కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. ఈ సెంబ్ కార్ప్ సంస్థ ఏకంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను చీటింగ్ చేసి..తప్పుడు నివేదిక ఇచ్చి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను అడ్డంగా మోసం చేసింది.

ఏకంగా తప్పుడు నివేదిక ఇచ్చి..కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పెట్టిన నిబంధనలను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఎందుకో అనుమానం వచ్చిన కేంద్ర పర్యావరణ శాఖ ఓ కమిటీతో పరిశీలన చేయిస్తే సెంబ్ కార్ప్ తప్పుడు నివేదిక సమర్పించినట్లు తేలింది. దీనికి ఏపీకి చెందిన ఫిషరీస్ శాఖ అధికారులు కూడా తమ వంతు సహకారం అందించారు. సెంబ్ కార్ప్ గాయత్రి లిమిటెడ్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పైనంపురం, శివరాంపురం గ్రామాల్లో 2x660 సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దిగుమతి చేసుకునే బొగ్గుతో ఈ ప్రాజెక్టులు నెలకొల్పారు. ఈ ప్రాజెక్టుకు గాను తొలుత నెల్ కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ కు అనుమతులు దక్కాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. తర్వాత ఈ అనుమతిని సెప్టెంబర్2017 వరకూ పొడిగించారు. ఈ మధ్యలో సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్ (ప్రాజెక్ట్ ప్రపొనెంట్) తమకు ఇఛ్చిన పర్యావరణ అనుమతిలోని నిబంధన ఐదు, ఆరును తొలగించాలని, ఇవి తమకు వర్తించవని పేర్కొంది. అసలు తమ ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి మత్స్యకార కుటుంబాలు, గ్రామాలు లేవని పేర్కొంది. అంతే కాక ఏపీ ఫిషరీస్ శాఖను సంప్రదిస్తే..ఆ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరక్టర్ కూడా ప్రాజెక్టును సందర్శించి అసలు ఈ ప్రాంతంలో ఎలాంటి మెరైన్ ఫిషింగ్ కార్యకలాపాలు లేవని ఓ లేఖ ఇఛ్చేశారు.

ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ధర్మల్ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీని కోసం ఓ సబ్ కమిటీని నియమించగా..2018 జూన్ 10-11 తేదీల్లో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ పరిశీలనలో సెంబ్ కార్ప్ గాయత్రి ఇచ్చిన నివేదిక తప్పు అని తేలింది. అంతే కాదు..ఈ ప్రాజెక్టుల పరిధిలో ఏకంగా 10 నుంచి 15 మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయని నిగ్గుతేల్చారు. ముత్తుకూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీలోని ఫిషరీష్ విభాగం అధిపతితో,,స్థానిక ప్రజా ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశం అయి వాస్తవాలు తెలుసుకుంది. అదే సమయంలో ఏపీ ఫిషరీస్ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ ఇఛ్చిన నివేదికను తిరస్కరించారు. అంతే కాదు..ఫిషరీస్ శాఖ నుంచి వివరణ కోరాలని నిర్ణయించారు. సెంబ్ కార్ప్ కోరినట్లు పర్యావరణ అనుమతిలోని నిబంధనలను తొలగించేందుకు కూడా కమిటీ తిరస్కరించింది. సెంబ్ కార్ప్ గాయత్రి లిమిటెడ్ తన సొంత నిధులతో ఈ ప్రాజెక్టు వల్ల ఏర్పడే పరిస్థితులను తెలుసుకునేందుకు సామాజిక, ఆర్థిక మదింపు చేయాలని పేర్కొంది.

Next Story
Share it