మోడీపై బాబు ‘రివర్స్ అవినీతి ఎటాక్’
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ఎంత అవినీతి చేసినా ప్రధాని నరేంద్రమోడీ తనను ఏమీ చేయలేరని నిర్థారణకు వచ్చారా?. బిజెపి నేతలు మాటలకు తప్ప చేతలకు పనికిరారని తేల్చుకున్నారా?. పరిణామాలు చూస్తుంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని ‘శిఖరాని’కి ఎక్కించిన చంద్రబాబు ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీపైనే ‘అవినీతి’ ఎటాక్ ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కర్ణాటక ఎన్నికల అనంతరం తనపై, కొంత మంది మంత్రులు..అధికారులను కేంద్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని..ప్రజలంతా తనకు రక్షణ కవచంగా ఉండాలని పలుమార్లు బహిరంగంగానే పిలుపునిచ్చారు. కానీ కర్ణాటక ఎన్నికలు అయిపోయి చాలా రోజులు అవుతున్నా...అటు మోడీ సర్కారు ఏపీలో అవినీతి విషయంలో మౌనంగానే ఉంది. పట్టిసీమ మొదలుకుని పోలవరం, స్విస్ ఛాలెంజ్ కుంభకోణం, నీరు-మీరు, రాజధాని నిర్మాణం, సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల్లో అడ్డగోలు అవినీతి జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి బిజెపి నేతలు అందరూ భారీ భారీ ప్రకటనలే చేశారు.
ఇక ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అయితే చంద్రబాబు సర్కారు అవినీతి చిట్టా అంతా తమ చేతిలో ఉందని...ఖచ్చితంగా తాము ఏపీ సర్కారుపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ జరిగింది శూన్యం. దీంతో ధైర్యం తెచ్చుకున్న చంద్రబాబునాయుడు నేరుగా మోడీపైనే అవినీతి ఎటాక్ చేయటం ప్రారంభించారు. అవినీతి కుడితిలో మోడీనే పడ్డారని వ్యాఖ్యానించారు. పోనీ చంద్రబాబు ఏమైనా రాఫెల్ కుంభకోణాన్ని ప్రస్తావించి మోడీని అవినీతిపరుడు అంటున్నారా? అంటే అదీ కాదు. వైసీపీతో లాలూచీ పడి అవినీతి కుడితిలో పడ్డారని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయల రాఫెల్ స్కాం చంద్రబాబుకు పెద్ద విషయం ఏమీ కాదు. ఆయనకు ఇక్కడ కావాల్సింది వైసీపీ కాబట్టి.. ఆ విషయాన్ని ప్రస్తావించారు కానీ..దేశ రక్షణ శాఖకు సంబంధించి ప్రస్తుతం దేశం అంతా గగ్గోలు పెడుతున్నా కనీసం దానిపై మాట మాత్రం కూడా మాట్లాడలేదు. అలాంటివి ఎన్ని జరిగినా చంద్రబాబు డోంట్ కేర్...అవినీతి అయినా..ఏదైనా తనకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు..తన సీటు కింద ఎసరు తెచ్చేది ఎంత చిన్న అవినీతి అయినా చంద్రబాబుకు చాలా ‘పెద్దగా’ కనపడుతుంది. అదీ లెక్క.