Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ పై చంద్రబాబు ప్రశంసలు

కాంగ్రెస్ పై చంద్రబాబు ప్రశంసలు
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘కాంగ్రెస్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకోపోతున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం నాడు రాజ్యసభలో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రసంగాలపై చంద్రబాబు ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ‘రాజ్యసభలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వారిపై ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించాయి.బిజెపి నేతల ప్రసంగాలు వారి అహాన్ని ప్రదర్శించాయి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఆయన మనసులో మాటను చెప్పకనే చెప్పినట్లు అయింది. అదే సమయంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డ్రామాలు ఆడేవారు జీరోలుగా మిగిలిపోతారు. నిరాశ,నిర్వేదంతోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు,నిందలు. కొత్త సభ్యులు తొలి స్పీచ్ లో కూడా ఏపికి జరిగిన అన్యాయం ఎండగట్టాలి?

రాజధాని నిర్మాణం,కడప ఉక్కు,విశాఖ రైల్వేజోన్ అంశాలపై పోరాడాలి. ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల వద్ద ఆందోళనలు జరపాలి. ఏ పార్టీకైనా ప్రజల్లో నమ్మకమే ముఖ్యం. ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయతే ముఖ్యం. 90% హామీలు నెరవేర్చామని బిజెపి నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు.ఆర్ధిక సంఘం హోదా ఇవ్వవద్దని చెప్పిందనన్నారు.వీటిపై ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చే అంశం పరిశీలించాలి.దీనిపై మిగిలిన పార్టీల మద్దతు కూడా పొందాలి. సభ సాక్షిగా అబద్దాలు చెప్పిన కేంద్ర మంత్రులను నిలదీయాలి. హామీలు ఇచ్చిన మన్మోహన్ సింగ్ సభలోనే ఉన్నారు. అప్పుడు ఏపి కోసం మాట్లాడిన వెంకయ్య అధ్యక్ష స్థానంలో ఉన్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it