Telugu Gateway
Andhra Pradesh

కొత్తగా ఈ ‘1500 రోజుల పండగ’ ఏంది బాబూ!

కొత్తగా ఈ ‘1500 రోజుల పండగ’ ఏంది బాబూ!
X

ఈ ఏడాది జూన్ నెలలోనే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పునరంకిత దీక్షలు..సభల పేరుతో కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేశారు. మళ్ళీ దీని కోసం పత్రికలు, టీవీల ప్రకటనలపై పెట్టిన ఖర్చు కూడా కోట్లలోనే. ఎవరైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తొలి వంద రోజులు...ఏడాది పూర్తయిన తర్వాత వార్షికోత్సవాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. ఇది ఏ పార్టీ ఉన్నా చేస్తూనే ఉంటుంది. గత నెలలోనే తెలుగుదేశం సర్కారు నాలుగేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. అందుకే పునరంకిత సభలు..కార్యక్రమాలు అంటూ ప్రజాధనంతో వారం రోజుల పాటు హంగామా చేసింది. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను విస్మరించి...జూన్ 2 నుంచి 8 వరకూ ఇలా కార్యక్రమాలు చేయటం ఏమిటి అనే విమర్శలు ఉన్నా...చంద్రబాబు వాటినేమి పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ ఇఫ్పుడు కొత్తగా ‘1500 రోజుల ప్రగతి’ పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి పండగ చేసుకుంటున్నారు. జూన్ లోనే వారం రోజుల పాటు ఈ నాలుగేళ్లలో తానేమి చేసింది చంద్రబాబు ప్రజలకు వారం రోజుల పాటు ‘చెవుల్లో తుప్పు వదిలేలా’ విన్పించేశారు. ఇది జరిగిన 40 రోజుల్లోనే కొత్తగా చెప్పటానికి చంద్రబాబు సాధించింది ఏమిటి?. అంటే ఏమీ లేదు.

చంద్రబాబుకు ప్రచారం చేసుకోవటానికి..ప్రజల డబ్బుతో పేజీలకు పేజీలు యాడ్స్ ఇవ్వటానికి ఓ కారణం కావాలి. అంతే...అదే 1500 రోజుల పండగ. ఓ వైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా..బ్రిడ్జిలు లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నా పట్టించుకోని చంద్రబాబు ఏదో కార్యక్రమం వెతుక్కుని ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంగా కారణంగా ఏ ప్రమాదంలో ఎవరు చనిపోయినా ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోవటం తప్ప...శాశ్వత నివారణ చర్యలు శూన్యం. గత కొంత కాలంగా ఏపీలో జరుగుతున్న పడవ ప్రమాదాలే దీనికి ఓ ఉదాహరణ. ఇందులో సర్కారు నిర్లక్ష్య ధోరణి, కొంత మంది నేతల డబ్బు కక్కుర్తి..అధికారుల అలసత్వం కలసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఓ వైపు గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతైన పిల్లల ఆచూకి తెలియక ఆ తల్లిదండ్రుల ఆందోళన అలాగే కొనసాగుతుండగానే...చంద్రబాబు మాత్రం ఇలా ప్రజల సొమ్ముతో ‘పండగలు’ చేసుకుంటున్నారు.

Next Story
Share it