Telugu Gateway
Andhra Pradesh

‘కాంగ్రెస్’ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు!

‘కాంగ్రెస్’ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు!
X

తెలుగుదేశం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయటం ఏమిటి అనుకుంటున్నారా?. అక్కడే ఉంది అసలు రాజకీయం. ఈ మధ్య కాలంలో ‘పోలవరానికి’ జాతీయ హోదా ఇఛ్చింది కాంగ్రెస్ పార్టీనే కానీ...బిజెపి కాదు అని ఆ పార్టీకి క్రెడిట్ ఇచ్చేశారు చంద్రబాబు. అంతే కాదు..రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతున్నారు అంటూ చంద్రబాబు ఇప్పుడు దీర్ఘాలు తీస్తున్నారు. మొక్కుబడిగా మాత్రం అప్పుడు కాంగ్రెస్ సరిగా చేసి ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఏపీలో జాతీయ నేతలతో కలసి సమావేశం నిర్వహిస్తేనే చంద్రబాబు డైరక్షన్ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు..క్యాడర్ నానా హంగామా సృష్టించారు. నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించి మళ్లీ ఇప్పుడు ఏపీకి వచ్చి సమావేశాలు పెడతారా? అని నిలదీశారు. చంద్రబాబు శనివారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక గురించి విలేకరులు ప్రస్తావించగా...చంద్రబాబు ఇచ్చిన సమాధానం చూసిన వారంతా విస్తుపోయారు. ఇది చంద్రబాబు సహజశైలికి భిన్నంగా జరిగింది. మామూలుగా అయితే అసలు ఏపీలో కాంగ్రెస్ ఎక్కడుంది?. కిరణ్ కుమార్ రెడ్డి చేరితే జరిగేది ఏముంది?. రాష్ట్రాన్ని విభజించిన పార్టీని ప్రజలు ఎప్పుడో నామరూపాలు లేకుండా చేశారు. ఎవరు చేరినా కాంగ్రెస్ పార్టీ లేవదు..ఏపీలో ఆ పార్టీకి స్కోప్ లేదు అంటూ ఉపన్యాసం దంచేవారు. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు సాగాయి. విభజన నిర్ణయంతో కిరణ్ విభేదించారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. నాలుగేళ్లు ఖాళీగా ఉండి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ను ఛాయిస్ గా ఎంచుకున్నారు..చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయాలను పరిశీలించిన వారెవరికైనా ఈ పరిణామం ఒకింత విస్మయపర్చేదే?. విభజన తాము కోరుకోలేదని చంద్రబాబు అక్కడే వ్యాఖ్యానించారు. నిజమే..ఏపీ ప్రజలు విభజన కోరుకోలేదన్నది వంద శాతం వాస్తవం. కానీ ఇదే చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడి హోదాలో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు కదా?.

ప్రజలతో కలిపేసుకుని తాను కూడా విభజనను వ్యతిరేకించినట్లు చంద్రబాబు ఇఫ్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, కిరణ్ చేరికపై చంద్రబాబు సాఫ్ట్ గా ఉండటానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ అదనంగా ఒక్క శాతం..రెండు శాతం మేర బలపడిన ఆ మేరకు ఓటు బ్యాంకుకు గండిపడేది ప్రధాన ప్రతిపక్షం వైసీపీకే అన్నది నిర్వివాదాంశం. వైసీపీ చేతిలో ఉన్న ఓటు బ్యాంకు అంతా ఒకప్పుడు కాంగ్రెస్ దే అన్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు ఇఫ్పుడు కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఎవరైనా అన్నా....కానివ్వండి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు. ఎన్నికల నాటికి ఆ పార్టీతో తెలంగాణ,ఏపీలో పొత్తు పెట్టుకోవటం ఖాయం అని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. తన సొంత రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు కాంగ్రెస్ ను క్షమించిన..ఏపీ ప్రజలు క్షమిస్తారా? లేదా అన్నది ఎన్నికల సమయంలోనే తేలుతుంది.

Next Story
Share it