జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు ఎక్కడ బాబూ!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘జిల్లాకో ఎయిర్ పోర్టు’ ప్రకటన చేశారు. 13 జిల్లాల్లో విమానాశ్రయాలు నెలకొల్పుతామని భారీ ప్రకటన చేశారు. అంతే ప్రధాన పత్రికల్లో కూడా ఫస్ట్ పేజీల్లో అదిరిపోయేలా వార్త వచ్చింది. ఈ ప్రతిపాదనపై అప్పట్లో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు అంతర్గత సమావేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజు అభ్యంతరాలపై చంద్రబాబు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అప్పట్లో. కానీ ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలోనే మొదలైన కడప ఎయిర్ పోర్టుకు మాత్రం ప్రారంభోత్సవం చేశారు. కొత్తగా కర్నూలు జిల్లాలో ఓ కొత్త విమానాశ్రయ నిర్మాణానికి మాత్రం రంగం సిద్ధం అయింది. అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మాత్రం ఏపీలో ఒక్కటీ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఆర్భాటపు ప్రకటనలు చేయటం...వాటిని మర్చిపోవటం చంద్రబాబునాయుడికి అలవాటే. అంతా సాఫీగా సాగితే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పనులు ఇఫ్పటికే మొదలై ఉండేవి.
కానీ చంద్రబాబునాయుడు ఈ టెండర్ దక్కించుకున్నప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అయితే ఎలాంటి కమిషన్లు ఇవ్వదని నిర్ణయించుకుని ఏకంగా టెండర్ నే రద్దు చేసి కొత్త రికార్డు సృష్టించారు చంద్రబాబు. ఇందుకు ఆయన చెబుతున్న కారణాలు ఏ మాత్రం హేతుబద్ధత లేనివే. ఏఏఐ అదనపు కాంపోనెంట్స్ తో సహా పనులు చేయటానికి తాము రెడీ అని చెప్పినా..ససేమిరా అంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే ఏఏఐ పనులు చేస్తే ప్రభుత్వ పెద్దలకు దక్కేమీ ఉండదు. ఏమీ దక్కకపోతే అది ప్రజలకు ఉపయోగపడేది అయినా ఆయన నో చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన కమిట్ మెంట్ అలాంటిది. ఇప్పుడు కొత్తగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం టెండర్లు పిలవనున్నారు. అంటే ముందే అస్మదీయ సంస్థకు దక్కేలా ప్లాన్ చేసుకుంటారన్న మాట. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా తాను హామీ ఇఛ్చిన జిల్లాకో ఎయిర్ పోర్టు ప్రస్తావన మాత్రం తీసుకురావటం లేదు చంద్రబాబు. ఎందుకంటే అది సాధ్యంకాదని చంద్రబాబుకూ తెలుసు. అప్పుడు ప్రజలను అమరావతి తరహాలో భ్రమల్లో ఉంచేందుకు ఇలాంటి ప్రకటన చేశారు. అవసరం తీరింది కాబట్టి..ఇప్పుడు కన్వీనెంట్ గా దాన్ని ఆయనా మర్చిపోయారు.