Telugu Gateway
Andhra Pradesh

పార్లమెంట్ లో ఎంపీలు మాట్లాడితే సన్మానాలా?

పార్లమెంట్ లో ఎంపీలు మాట్లాడితే సన్మానాలా?
X

ఎమ్మెల్యేలు అసెంబ్లీలో...ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడటం వారి బాధ్యత. ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను లేవనెత్తటం... కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరటం వారి విధి. ఇందులో ఎలాంటి ప్రత్యేకత కానీ..అనూహ్య సంఘటనలు కానీ ఏమీ ఉండవు. కానీ తమ ఎంపీలు పార్లమెంట్ లో బాగా పోరాడారని...ఎంతో బాగా మాట్లాడారని, ఎన్డీఏను గడగడలాడించారనే భ్రమలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ బహిరంగ సభ సాక్షిగా ఎంపీలకు సన్మానం చేయటం ఏమిటి?. వాళ్ళ డ్యూటీ వాళ్లు చేస్తే అందులో ప్రత్యేకత ఏమి ఉంది?. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగం చేయటం వారి విధి. అలాగే ఎంపీలను ప్రజల ఎన్నుకునేది వారి సమస్యలు పార్లమెంట్ లో లేవనెత్తి పరిష్కరించేందుకే. అందుకు వారికి వేతనం కూడా వస్తుంది. వారి జీతం వారు తీసుకుని..చేయాల్సిన పని చేస్తే సన్మానాలు ఏమిటో?. పోనీ లోక్ సభలో పోరాడి రాష్ట్రానికి ఏమైనా ‘ప్రత్యేక హోదా’ ఏమైనా సాధించారా? అంటే అదీ లేదు. కేవలం మాట్లాడినందుకే సన్మానాలు చేస్తే...ఇక ప్రత్యేక హోదా తెచ్చి ఉంటే ఎంపీలను చంద్రబాబు ఏమి చేసేవారో. ప్రజలను నిత్యం ఏదో ఒక ఈవెంట్ తో భ్రమల్లో ఉంచేలా చేయటంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగానే ఈ సన్మానాల ఈవెంట్.

అవిశ్వాస తీర్మానం పెట్టిన అదే సభలోనే ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చంద్రబాబు తొలుత ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని చెప్పారు. ముందు ప్యాకేజీకి ఒప్పుకుని తర్వాత యూ టర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ పాపం పూర్తిగా చంద్రబాబుదే. ప్రత్యేక ప్యాకేజీ భేష్ అంటూ అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని సన్మానించిన చంద్రబాబును ఏమనాలి. ప్రత్యేక ప్యాకేజీనే బెటర్ అంటూ మాట్లాడింది...ఇప్పుడు ప్రత్యేక హోదానే శరణ్యం అంటూ మాట్లాడుతూ మాట మార్చింది కూడా చంద్రబాబే. ఇందులో ఎంపీల పాత్ర పరిమితమే. ఎంపీలకు నిత్యం మార్గనిర్దేశం చేస్తూ..టెలికాన్ఫరెన్స్ లో వారిని ఉత్తేజితులను చేస్తూ ‘పోరాటానికి మార్గనిర్దేశం’ చేసిన చంద్రబాబును కూడా ఎంపీలు సన్మానించి ఉంటే ఓ పనైపోయేదేమో. చంద్రబాబు సన్మానం చేసిన వాళ్లలో సగం అసలు నోరెత్తలేదు. బయట ప్లకార్డులు పట్టుకుని ధర్నాలు చేసినందుకేనేమో ఈ సన్మానాలు?. బాబోయే..చంద్రబాబు ఏదైనా చేయగలరు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి?. సన్మానం ఏదైనా సాధించిన వారికి చేస్తారు. కానీ ఏపీలో మాత్రం మాట్లాడినా చేస్తారు...ప్లకార్డు పట్టుకున్నా చేస్తారు. అక్కడ అంతే మరి?..

Next Story
Share it