Telugu Gateway
Andhra Pradesh

బాబు దీక్షతో ప్రత్యేక హోదా...సీఎం రమేష్ దీక్షతో స్టీల్ ప్లాంట్!

బాబు దీక్షతో ప్రత్యేక హోదా...సీఎం రమేష్ దీక్షతో స్టీల్ ప్లాంట్!
X

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక్క రోజు దీక్ష చేయటంతో...జిల్లాల వారీగా ధర్మ పోరాట దీక్షలు చేయటంతో ఏపీకి ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ప్రకటించేశారు!. ఆ ఫలాలను ఇప్పుడు ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారు కూడా. ఇక తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కడపలో వారం రోజులకు పైగా చేసిన నిరాహారదీక్షతో కడపలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. అక్కడి యువతకు ఉద్యోగాల మీద ఉద్యోగాలు వచ్చేశాయి. ఎందులో చేరాలో తెలియక అక్కడి యువత తేల్చుకోలేకపోతున్నారు. ఇక టీడీపీ ఎంపీలు ఒక్క రోజు అంటే..ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన నిరాహారదీక్షతో విశాఖకు రైల్వే జోన్ వచ్చేసింది. ఆ ప్రాంత ప్రజలు అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సన్మానం చేయటానికి రెడీ అయిపోతున్నారు. ఓ వైపు ఏపీ కష్టాల్లో ఉంటే ఈ వెటకారాలు ఏంటి? అంటారా?. ఇవి ఏ మాత్రం వెటకారాలు కావు. నాలుగేళ్లు బిజెపి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి..కడప స్టీల్ ప్లాంట్..రైల్వే జోన్..ప్రత్యేక హోదా వంటి కీలకమైన ఏ ఒక్క హామీని అమలు చేయించుకోలేకపోయిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండి దీక్షలు...ధర్మ పోరాటాలు అంటూ హంగామా చేయటమే వింత...విచిత్రం.

అలాంటిది వైసీపీ బంద్ తో ప్రయోజనం ఏంటి? అని చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా తన నిరసన తెలియజేయటానికో..తమ ఏజెండాను ప్రజల్లో తీసుకెళ్లేందుకో ఇలాంటి కార్యక్రమాలు చేయటం సహజం. కానీ చంద్రబాబు తాను ధర్నాలు..దీక్షలు చేయటంతో అన్నీ వచ్చేశాయి..ఇక మిగిలిన పార్టీలు బంద్ లు చేయటం ఏమిటి?. బంద్ లు చేయటం వల్ల ప్రజలకు నష్టం తప్ప..లాభం ఏమి ఉంటుంది అని వ్యాఖ్యానించారు టెలికాన్ఫరెన్స్ లో. నిజమే ఏ పార్టీ బంద్ నిర్వహించినా అది ప్రజలకు ఇబ్బందే. పోనీ చంద్రబాబునాయుడు కానీ..టీడీపీ నేతలు కానీ తాము ప్రతిపక్షంలోకి వచ్చినా బంద్ లు చేయం అని ఎన్నికల కమిషన్ కు కానీ...లేదా మరేదైనా రాజ్యాంగ బద్ద సంస్థకైనా అఫిడవిట్ ఇవ్వగలరా?. నిరసన తెలపటం అనేది ప్రతిపక్షాల హక్కు. అసలు ఓ పార్టీ తలపెట్టిన బంద్ పై ముఖ్యమంత్రి...మంత్రులు...పార్టీ నేతలు అంతగా హైరానా పడాల్సిన అవసరం ఏముంది?. రాష్ట్రంలో అంతకు ముందు ఎన్నిసార్లు బంద్ లు జరగలేదు. అందులో ఎన్ని టీడీపీ చేయలేదు?. సంప్రదాయాలకు భిన్నంగా అధికార పార్టీనే రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టే వింత పోకడలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు..బంద్ లతో ప్రయోజనం ఏమిటి?. అని ప్రశ్నించటమే వింత. మరి నిజంగా ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలిసినప్పుడు పార్టీపరంగా టీడీపీ భవిష్యత్ లో ఎన్నడూ బంద్ లు చేయదు అని ప్రకటించి ఆదర్శంగా నిలబడొచ్చుగా?. అప్పుడు మాత్రమే ఆ పార్టీకి బంద్ లను వ్యతిరేకించే నైతిక హక్కు వస్తుంది?. అంతే తప్ప..రాజకీయ కారణాలతో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నమ్ముతారా?.

Next Story
Share it