Telugu Gateway
Andhra Pradesh

‘పోలవరం’లో అడ్డంగా దొరికిన చంద్రబాబు!

‘పోలవరం’లో అడ్డంగా దొరికిన చంద్రబాబు!
X

పోలవరం ప్రాజెక్టు విషయంలో ‘కేంద్రానికి’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారు. కాగ్ తన నివేదికలో ఈ జాతీయ ప్రాజెక్టులో జరిగిన పలు అక్రమాలను కళ్ళకట్టినట్లు చూపెట్టింది. దీంతో సర్కారు చిక్కుల్లో పడటం ఖాయంగా కన్పిస్తోంది. అంతే కాదు..ముంపు గ్రామాల లెక్కల్లో తేడాలను కూడా కాగ్ ఎత్తిచూపింది. 2006లో ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో పోలవరం వల్ల 276 గ్రామాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. తాజాగా అందించిన జాబితాలో మాత్రం ఆ గ్రామాల సంఖ్య 371కి పెరిగింది. ఈ ప్రాజెక్టు కారణంగా నష్టపోయే కుటుంబాల సంఖ్య 44,574గా పేర్కొన్నారు తొలుత. కానీ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ జాబితా ప్రకారం చూస్తే నష్టపోయే కుటుంబాల సంఖ్య 1,05,601కి పెరిగింది. ఈ సంఖ్యలో నిత్యం మార్పులు చేస్తూ...ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలును అత్యంత నిర్లక్ష్యంగా అమలు చేశారని కాగ్ తప్పు పట్టింది. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచలేదు...ఆయకట్టులో మార్పులేదు. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే భూ పరిమాణాన్ని గణనీయంగా పెంచింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్ర నితిన్ గడ్కరీ తన పోలవరం పర్యటన సంద్భరంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ముంపునకు గురయ్యే భూమి, కుటుంబాల సంఖ్యను పెంచటం ద్వారా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక అక్రమాలకు అయితే అంతే లేకుండా పోయింది. కాగ్ కూడా పార్లమెంట్ కు సమర్పించిన నివేదికలో ఇవే అంశాలను ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్ కు సుమారు 1400 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పించినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. నామినేషన్ల కింద పనులు అప్పగించిన వైనాన్ని..కోట్లాది రూపాయల భారాన్ని ఖజానాపై మోపిన విషయాన్ని కూడా కాగ్ నిగ్గుతేల్చింది. మరి ఈ కాగ్ నివేదికపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it