Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు సమర్పించు..అమరావతి టెండర్ల స్కామ్

చంద్రబాబు సమర్పించు..అమరావతి టెండర్ల స్కామ్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రాజధాని ‘అమరావతి’ ఓ కల్పవృక్షంగా మారింది. ఆయన దోపిడీకి ఇది ఓ కేంద్ర బిందువు అయింది. ఎవరేమి చేస్తారులే అన్న ధీమాతో ఆయన రాజధానిలో ‘టెండర్ల’ ఆట ఆడుతున్నారు. ఎలా అయినా తాను కోరుకున్న కంపెనీలకు..కోరుకున్న రేట్లకు టెండర్లు అప్పగించి..వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ వ్యవహారం అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ మార్గంలో సేకరించిన భూముల్లో ఇప్పుడు రహదారులు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరాకు సంబంధించిన డక్ట్స్ ఏర్పాటు, నీటిని తిరిగి వినియోగించే ఏర్పాట్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టనున్నారు. తొలుత ఈ పనులను ‘హైబ్రిడ్ యాన్యుటీ’ విధానం కింద చేపట్టాలని నిర్ణయించి..టెండర్లు పిలిచి కొన్ని ప్యాకేజీలకు టెండర్లు కూడా ఖరారు చేశారు. అది కూడా అస్మదీయ సంస్థలకే. దీని కోసం ఓ ప్రముఖ కన్సల్టెన్సీ సర్వీసులు తీసుకుని మరీ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చారు.

ఇప్పడు ఆ మోడల్ కు కట్ చెప్పేసి.. మళ్ళీ ఈపీసీ పద్దతిలో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆరు జోన్లలో పనులు చేపట్టేందుకు మొత్తం 7768 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏపీసీఆర్ డీఏ టెండర్లు ఆహ్వానించింది. పేరుకు టెండర్లు పిలిచినా..ఇవి కూడా అస్మదీయ సంస్థలకే వెళ్ళటం ఖాయం అని మౌలికసదుపాయాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సర్కారు సమ్మతి లేకుండా అక్కడ అడుగుపెట్టి పనిచేసే పరిస్థితి ఏ కాంట్రాక్ట్ సంస్థకు ఉండదు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి సింగిల్ టెండర్లను కూడా ఓకే చేస్తూ ముందుకు సాగుతోంది. ఎందుకంటే దోపిడీ ముఖ్యం...నిబంధనలు అనవసరం అన్న చందంగా సర్కారు పరిస్థితి తయారైంది. సింగపూర్ సంస్థలు కావాలన్నప్పుడు ‘స్విస్ ఛాలెంజ్’ మోడల్. మరో పనులకు హైబ్రిడ్ యాన్యుటీ విధానం, ఇప్పుడు మళ్ళీ ఈపీసీ మోడల్. ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానితో టెండర్ల ఆట ఆడుతున్నారు. ఉన్నతాధికారులు అందరూ ప్రేక్షక పాత్ర వహించటం తప్ప..వీటిని అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నారు. ఎవరైనా ఏదైనా అభ్యంతరాలు చెప్పిన ‘కేబినెట్’లో పెడతాం అంటూ ముందుకు సాగుతున్నారు.

Next Story
Share it