అశోక్ గజపతిరాజుకూ ‘మరక’ అంటించిన చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీతో ఎంతగా విభేదించేవారు అయినా ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై అవినీతి విమర్శలు చేయటానికి సాహసించరు. అలాంటి అశోక్ గజపతిరాజు కు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘మరక’ అంటించారు. తన స్వార్ధం కోసం కేంద్ర విమానయాన శాఖ పరిధిలో ఉన్న ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కు టెండర్ మార్గంలో దక్కిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం దక్కకుండా చేశారు. అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేక...ఏఏఐకి దక్కిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో చేతులెత్తేశారు. కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావటంతో సీన్ రివర్స్ అయింది. ఏఏఐకి దక్కిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం టెండర్ ను ఎందుకు రద్దు చేశారో తెలపాలంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అంతే కాదు...ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ ప్రాజెక్టులో చేర్చాలనుకున్న విమానాల మెయింట్ నెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్ వో) సౌకర్యాన్ని, ఏరో సిటీని తాము కూడా అభివృద్ధి చేస్తామని..టెండర్ గడువు పెంచి వీటిని కూడా తమకే అప్పగించాలని ఏఏఐ లేఖ రాసింది.
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఏడీసీఎల్) అధికారులు కూడా అదనపు పనులు ఇవ్వాలని సిఫారసు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు ఇరకాటంలో పడినట్లు అయింది. ఏఏఐ టెండర్ ను రద్దు చేసి..అన్ని పనుల తరహాలోనే అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించేందుకు ప్లాన్ వేసుకున్నారు. కేంద్రం జోక్యంతో ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. అంతే కాదు..ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కోని మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా చంద్రబాబు చర్యల వల్ల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చిందని టీడీపికి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.