Telugu Gateway
Andhra Pradesh

రైల్వే జోన్ కు ఓకే చెప్పిన రాజ్ నాధ్

రైల్వే జోన్ కు ఓకే చెప్పిన రాజ్ నాధ్
X

కేంద్రం ఎట్టకేలకు విశాఖపట్నంలో రైల్వే జోన్ కు సుముఖత చూపింది. రాజ్యసభలో విభజన చట్టంలోని ఏపీ హామీలపై జరిగిన స్వల్పకాలిక చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సమాధానం ఇఛ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రతికూలంగా నివేదికలు వచ్చినా..తాము జోన్ ఏర్పాటుకు సిద్ధం ఉన్నట్లు సభలో తెలిపారు. జోన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో అత్యంత కీలకమైన హామీల్లో ఒకటి నెరవేరేందుకు మార్గం సుగమం అయినట్లే. అయితే ప్రత్యేక హోదా విషయంలో మాత్రం రాజ్ నాధ్ సింగ్ తన సమాధానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరును ఎండగట్టారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నది చంద్రబాబేనని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు, సుజనా చౌదరి స్వాగతించారని, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారని గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో సమానంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తున్నామని, దీనికి ముఖ్యమంత్రి కూడా అంగీకారం తెలిపారన్నారు. ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తామే కడతామని ఏపీ సర్కార్‌ కోరితే అంగీకరించామని, పోలవరానికి ఇప్పటివరకూ రూ 6754 కోట్లు మంజూరు చేశామన్నారు. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తారా లేదా స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేష్‌, గులాం నబీ ఆజాద్‌ ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో హోదా నిరాకరించడం సరైందికాదని విమర్శించారు.మరోవైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై రాజ్‌నాథ్‌ సెటైర్లు వేశారు. చర్చలో తాము చెబుతున్న అంశాలపై సుజనా చౌదరి మారుమాట్లాడలేక తలదించుకున్నారని విమర్శించారు.

Next Story
Share it