కత్తి మహేష్ కు ఏపీలోనూ కష్టాలు
కత్తి మహేష్ హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. నగరం నుంచి బహిష్కరించి ఆయన సొంత ప్రాంతంలో తెలంగాణ పోలీసులు వదిలేసి వచ్చారు. అప్పటి నుంచి పెద్దగా వార్తల్లోకి రాలేదు కత్తి మహేష్. అయితే ఆయన సోమవారం నాడు చిత్తూరు జిల్లాలోని పీలేరులో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఈ సమావేశం నిర్వహించకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అంతే కాదు..అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. హైదరాబాద్ లో ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్ శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయటంతో పెద్ద దుమారం చెలరేగింది.
ఆయనపై చర్యలు తీసుకోవాలని హిందూ మత సంస్థలు ఫిర్యాదులు చేశాయి. స్వామి పరిపూర్ణానంద అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా నగరం నుంచి యాదాద్రి వరకూ దర్మాగ్రహ యాత్ర తలపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయన్ను కూడా నగరం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే.