Telugu Gateway
Andhra Pradesh

పిల్లల కిడ్డీ బ్యాంకులు రాజధానికి... చంద్రబాబు ప్రచారానికి కోట్లా?

పిల్లల కిడ్డీ బ్యాంకులు రాజధానికి... చంద్రబాబు ప్రచారానికి కోట్లా?
X

‘రాజధాని నిర్మాణం’ కోసం పిల్లల కిడ్డీ బ్యాంకు డబ్బులు విరాళంగా ఇస్తున్నారు. ‘మై బ్రిక్..మై అమరావతి’ అంటూ ఇటుక ఇటుకా అమ్మింది ఏపీ సర్కారు. అలాంటిది ఒక్కో రూపాయిని ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఖర్చు పెట్టాలి. రూపాయి ..రూపాయి ఎంత పొదుపుగా వాడాలి?. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్నది ఏంటి?. ప్రజల సొమ్ముతో సొంత ప్రచారం. దేశంలో ఎక్కడా లేని రీతిలో 1500 రోజుల పండగ పేరుతో పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇఛ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ అంటూ ఏపీ, తెలంగాణతోపాటు పలు పత్రికల్లో మరోసారి కోట్లాది రూపాయల కుమ్మరింత. ఓ వైపు తన అవసరాల కోసం...తన ప్రచారం కోసం ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ...‘సెంటిమెంట్’ జోడించి ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించటం ఎందుకు?. నిజంగా అంత కష్టాల్లో ఉంటే ఎవరైనా ఇంత దుబారా చేస్తారా?. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లు ఆయన పనితీరు విధానాలు చూసి..లక్షలకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నప్పుడు ఇక ప్రచారం ఎందుకు?.

రాజధాని నిర్మాణం కోసం మధ్య తరగతి రైతులు కూడా చాలా మంది విరాళాలు అందించారు. ఎన్ఆర్ఐలు కూడా కొంత మంది తమ వంతు సాయం చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రం కష్టాల్లో ఉంది...కేంద్రం మోసం చేసింది.. నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పుకుంటూ..చివరకు ‘అన్న క్యాంటీన్ల’కూ కూడా బహిరంగంగా విరాళాలకు పిలుపునిచ్చే సీఎం చేయాల్సిన పనేనా?. ఇది. ఓ వైపు రాష్ట్రంలో కనీస మౌలికసదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో. ముందు వాటిని పరిష్కరించటం ప్రాధాన్యతా?. లేక కోట్ల రూపాయలు వెచ్చింది ప్రచారం చేసుకోవటం ప్రాధాన్యతా?. తన ప్రచారం కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవటానికి..విదేశీ పర్యటనలకు...ప్రత్యేక విమానాల్లో తిరగటానికి డబ్బులు ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించటం ఎందుకు?. పేద అరుపులు ఎందుకో?.

Next Story
Share it