Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఎస్ఎస్ఏ స్కామ్ పై ‘ఢిల్లీ నజర్’!

ఏపీ ఎస్ఎస్ఏ స్కామ్ పై ‘ఢిల్లీ నజర్’!
X

ఆంధ్రప్రదేశ్ లోని సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో చోటుచేసుకుంటున్న కుంభకోణాలపై కేంద్ర విచారణ సంస్థలు దృష్టి సారించాయా?. అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలికసదుపాయాల అభివృద్ధితోపాటు పలు కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. అయితే గత కొంత కాలంగా సర్వశిక్షా అభియాన్ లో దోపిడీ పర్వం ఎన్నడూలేనంత తీవ్ర స్థాయికి చేరటంతో కొంత మంది బిజెపి ఎంపీలు ఢిల్లీలోని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ప్రాజెక్టు డైరక్టర్ జి. శ్రీనివాస్, ఐఏఎస్ పై కొంత మంది ఇఫ్పటికే ఢిల్లీలోని విచారణ సంస్థలకు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కింద అమలు చేసిన పనుల్లోనూ భారీ ఎత్తున అవకతకవలు జరిగినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా సర్వశిక్షా అభియాన్ లో 4848 కోట్ల రూపాయల టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడేందుకు అంతా రంగం సిద్ధం చేసుకోవటం ఈ వార్త ‘తెలుగు గేట్ వే. కామ్’లో సవివరంగా రావటంతో సర్కారు ఈ టెండర్లను రద్దు చేసింది.

అసలు ఏపీసీఆర్ డీఏ వంటి సంస్థే వివాదస్పద ‘హైబ్రిడ్ యాన్యుటీ’ మోడల్ కింద టెండర్లు పిలిచి..వెనక్కి తగ్గింది. అలాంటిది సర్వశిక్షా అభియాన్ అధికారులు మాత్రం ఓకేసారి భారీ ఎత్తున దోపిడీ చేసేందుకు వీలుగా ఓ హైబ్రిడ్ యాన్యుటీ ‘స్కెచ్’ తయారు చేసుకుని కేంద్రం అందించే నిధులతోపాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ద్వారా పనులు కాంట్రాక్టర్లకు అప్పగించేసి..భారీ ఎత్తున దోపిడీ చేసేందుకే ఈ మోడల్ ను ఎంచుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం 4848 కోట్ల పనుల టెండర్లను రద్దు చేసినా..మళ్ళీ ఈ పనులను తాను అనుకున్నట్లు ‘పంచేందుకు’ ఎస్ఎస్ఐ డైరక్టర్ రంగం సిద్ధం చేసుకున్నారని కొంత మంది ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయి.

దీంతో బిజెపి ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేయటానికి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టు అమలు విషయంలో కేంద్రం కూడా తన తరపున ఓ ప్రతినిధిని పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. లేదంటే స్కూలు పిల్లల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా కొంత మంది ప్రజాప్రతినిధులు..అధికారులు కుమ్మక్కు అయి దోపిడీకి ప్లాన్ చేయటం దారుణం అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే జరిగిన పనులపై కొంత మంది ఫిర్యాదులు చేశారు. కొత్తగా పనుల కోసం మళ్ళీ టెండర్లు పిలిచారని..ఇవి కూడా ఈ నెలాఖరులో కేటాయించే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో బిజెపీ ఎంపీలు అప్రమత్తం అయ్యారు.

Next Story
Share it