పవన్ కళ్యాణ్ పవర్ పంచ్ కు ‘టీడీపీ విలవిల’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తారో తెలియదు. ఎన్ని ఓట్లు సాధిస్తారో ఇఫ్పుడే చెప్పటం కష్టం. కానీ ప్రజాపోరాట యాత్ర పేరుతో ఈ జనసేనాని మొదలుపెట్టిన యాత్ర మాత్రం అధికార టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. సాక్ష్యాత్తూ తెలుగుదేశం నేతలు పవన్ ప్రభావంపై తర్జనభర్జనలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రకు ఉత్తరాంధ్రను ఎంచుకోవటం వెనకే పక్కా వ్యూహాం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫోకస్ అంతా అమరావతి, పోలవరం, పట్టిసీమ జపం తప్ప వేరే అంశాలేమీ మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్రకు రావాల్సిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కూడా ఆయనే అడ్డుపడ్డారు. ఏదో ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి అంశాలు ప్రస్తావించటం తప్ప..అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా దృష్టి సారించటం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ పర్పెక్ట్ గా వాడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కానీ..ప్రస్తుతం పవన్ పర్యటన సాగుతున్న విజయనగరం జిల్లాలోనూ పూర్తిగా ‘స్థానిక అంశాల’పైనే ఫోకస్ పెట్టి సర్కారు ఇరకాటంలో పెడుతున్నారు.
స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలను..సాగునీటి ప్రాజెక్టులు, మత్స కార్మికుల జెట్టీల సమస్యలను, నిరుద్యోగ యువత అంశాలను ప్రస్తావిస్తుండటంతో పవన్ అక్కడి ప్రజలకు బాగా ‘కనెక్ట్’ అవుతున్నారని..ఇది ఏ మాత్రం తమకు సానుకూల సంకేతం కాదని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. నవనిర్మాణదీక్షల పేరుతో 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ముఖ్యమా?. లేక అదే డబ్బుతో మత్స కార్మికులకు చేపలు పట్టుకునేందుకు జెట్టీలు ఏర్పాటు చేయించటం ముఖ్యమా? అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వ దుబారాను..స్థానిక సమస్యలను కలిపి ప్రస్తావించటం ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో ఈ సర్కారు తమను పట్టించుకోవటంలేదనే అభిప్రాయం కల్పించటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నట్లు ఆయన పర్యటనలు నిరూపిస్తున్నాయి. పవన్ ప్రసంగాలు...సమస్యల ప్రస్తావన టీడీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటంతోనే టీడీపీ సోషల్ మీడియా టీమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శల దాడి పెంచింది. అదే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలసి ఉన్నన్న రోజులు ఈ వ్యక్తిగత తప్పులు ఏమీ వాళ్లకు గుర్తులేవు. రావు కూడా. జగన్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసే విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలను ఉలిక్కిపడేలా చేస్తోంది. పవన్ పై ఎటాక్ చేయటానికి టీడీపీ వద్ద పెద్ద అస్త్రాలు కూడా ఏమీ లేవు. గతంలో మాకు మద్దతు ఇచ్చి..ఇప్పుడు తిడుతున్నారనే మాటలు తప్ప. అందుకే పవన్ ను బిజెపితో కలిపిస్తే దెబ్బతీయవచ్చనే ప్లాన్ లో టీడీపీ ఉంది. నాలుగేళ్లు బిజెపితో కలసి ఉన్న టీడీపీ అదే విమర్శలు చేస్తే ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారో వేచిచూడాల్సిందే.