Telugu Gateway
Andhra Pradesh

అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం తేలేది జూలైలో!

అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం తేలేది జూలైలో!
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ అభివృద్ధి కోసం ఏపీ సర్కారు ప్రపంచ బ్యాంకు రుణంపై భారీ ఆశలే పెట్టుకుంది. కానీ కొంత మంది రైతుల దగ్గర నుంచి వెళ్ళిన ఫిర్యాదులతో ఈ రుణ మంజూరు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అమరావతికి రుణం మంజూరు చేయాలా? వద్దా అనే అంశంపై ప్రపంచ బ్యాంకు వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకోనుంది. నేరుగా రుణం మంజూరు చేస్తుందా? లేక ఫిర్యాదుపై విచారణ జరిపిన తర్వాతే ముందుకెళుతుందా? అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకోనుంది. ఫిర్యాదులపై విచారణ జరపాలని నిర్ణయిస్తే మాత్రం ఈ రుణం మంజూరులో విపరీత జాప్యం చేసుకోవటం ఖాయంగా చెబుతున్నారు. అమరావతి కోసం ఏపీ సర్కారు ల్యాండ్ పూలింగ్ మోడల్ కింద రికార్డు స్థాయిలో 33 వేల ఎకరాలు సేకరించిన విషయం తెలిసిందే. దీనిపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మించటం వల్ల పర్యావరణంపై...అక్కడి ప్రజల జీవన స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాలను మదింపు చేసిన తర్వాత కానీ ప్రపంచ బ్యాంకు తుది నిర్ణయం తీసుకోదు.

ప్రపంచ బ్యాంకు ఏపీ నూతన రాజధానికి 300 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అందులో 200 మిలియన్ డాలర్లు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు (ఏఐఐబి) కో ఫైనాన్స్ చేయనుంది. గత ఏడాది మే మే 25న కొంత మంది రైతులు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాస్తూ..రాజధాని నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో తమ జీవనాధారం దెబ్బతినటంతో పాటు...పర్యావరణం, ఆహార భద్రతకు కూడా ముప్పు ఉంటుందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచే ఈ రుణ ప్రక్రియ నిలిచిపోయింది. ఇఫ్పటికే అమరావతిలో మౌలికసదుపాయాల కల్పనకు ఏపీ సర్కారు భారీ ఎత్తున అప్పులు తీసుకువస్తోంది. ప్రపంచ బ్యాంకు రుణం అయితే తక్కువ వడ్డీ ఉంటుంది కాబట్టి..సర్కారుకు కొంత ఉపయుక్తంగా ఉండనుంది. అయితే మరి ఏపీ సర్కారు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it