Telugu Gateway
Telangana

ఉత్తమ్ కెసీఆర్ కు సరెండర్ అయ్యారా?

ఉత్తమ్ కెసీఆర్ కు సరెండర్ అయ్యారా?
X

ఇదీ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ హాట్ గా సాగుతున్న చర్చ. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే భారీ స్కామ్ జరిగింది. కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ సర్కారు కూడా హౌసింగ్ స్కామ్ దుమ్ముదులుపుతామని..ఈ సంగతి తేలుస్తామని ఘాటు ప్రకటనలు అయితే జారీ చేసింది. కానీ అదేమీ ముందుకు సాగటం లేదు. అయితే ఈ స్కామ్ లో ఇరుక్కున్న ఉత్తమ్ కొద్ది రోజుల క్రితం నుంచి సీఎం కెసీఆర్ కు సన్నిహితుడు అయిన ఓ పారిశ్రామికవేత్త ద్వారా రాజీ చేసుకున్నారని....అదే కారణంతో ఉత్తమ్ మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొంత మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ కారణంతోనే ఉత్తమ్ తలపెట్టిన బస్సు యాత్రకు ఆకస్మికంగా బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు జానారెడ్డి తీరుపైనా ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయి. కాంగ్రెస్ కు అత్యంత కీలకమైన తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నా..వీరిద్దరి వైఖరి వల్లే దెబ్బతింటున్నామని భారీ ఎత్తున ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం నెలకొని ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే అతి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కాంగ్రెస్ సీనియర్లు ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా భారీమార్పులు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జానారెడ్డి స్థానంలో భట్టి విక్రమార్కను కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా చేసే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తమ్ పై కూడా వేటు ఖాయం అని..అయితే ఎవరికి ప్రచార బాధ్యతలు ఇవ్వాలి..ఎవరికి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలనే అంశంపై కసరత్తు జోరుగా సాగుతోందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించటంపై కొంత మంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే కెసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ప్రచారంలో దిట్ట అయిన రేవంత్ రెడ్డి లాంటి వారికే పదవి ఇవ్వటం ఉత్తమం అనే వాదనను కూడా కొంత మంది తెరపైకి తెస్తున్నారు. అయితే రేవంత్ కు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి అనధికారికంగా ప్రచారం బాధ్యతలు అప్పగిస్తారా?. లేక నేరుగా ప్రచార బాధ్యతలు అప్పగిస్తారా? అన్న అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. కెసీఆర్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఎంతో ఉందని..దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో నాయకుల కారణం విఫలమవుతున్నాయని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.

Next Story
Share it