శ్రీనివాసరాజుకు దేవుడి కంటే..‘మేడమ్’ అంటేనే భయమా?
టీటీడీ జెఈవో శ్రీనివాసరాజుకు దేవుడి కంటే మేడమ్ అంటేనే భయమెక్కువా?. అసలు ఇంతకీ ఎవరు ఆ మేడమ్. గత కొన్ని నెలలుగా తిరుమలలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై ఇంత వరకూ ఒక్కసారి కూడా నోరెత్తని జెఈవో రాజు అకస్మాత్తుగా ‘మేడమ్’ పేరెత్తగానే ఎందుకు ఉలిక్కిపడి భయటకు వచ్చారు. ఇంత కాలం టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఎన్ని తీవ్రమైన విమర్శలు చేసినా మౌనంగా ఉన్న శ్రీనివాసరాజు ‘మేడమ్’ అనే మాటతోనే ఉలిక్కిపడి ఇఛ్చిన వివరణ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతే కాదు..శ్రీనివాసరాజు శుక్రవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ‘రమణ దీక్షితులపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా మౌనంగా ఉన్నాం.’ ఇదీ టీటీడీ జెఈవో శ్రీనివాసరాజు చేసిన ప్రకటన. ఫిర్యాదులు వస్తే మౌనంగా ఉండటానికి టీటీడీ అనేది శ్రీనివాసరాజు సొంత వ్యవహారమా?.
దేవుడి పవిత్రత, భక్తుల నమ్మకాలను పట్టించుకోరా?. రమణదీక్షితులపై అయినా..ఎవరిపై అయినా ఫిర్యాదులు వస్తే సరైన విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలి కానీ..ఫిర్యాదులు వస్తే ఎందుకు మౌనంగా ఉండటం. అంటే మీ అక్రమాలకు మేం అడ్డురాం...మా అక్రమాలకు మీరు అడ్డు రావద్దని ఏమైనా అంగీకార ఒప్పందమా?. శ్రీనివాసరాజు తన ప్రకటన ద్వారా భక్తులకు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నారు. రమణదీక్షితులపై ఫిర్యాదులు వస్తే ..ఆయన నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి..వదిలేశామని బహిరంగంగా చెప్పటం వెనక ఔచిత్యం ఏమిటి?. అసలు శ్రీనివాసరాజు కోట్లాది మంది కొలిచే వెంకటేశ్వరస్వామి భక్తులకు ఏమి చెప్పదలచుకున్నారు?.
అసలు తిరుమలలో అవకతవకలకు..ఇష్టారాజ్యంగా పరిపాలన సాగటానికి ప్రధాన కారణం జెఈవో శ్రీనివాసరాజే ప్రధాన కారణమనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అత్యంత కీలకమైన టీటీడీ జెఈవో పోస్టులో శ్రీనివాసరాజును చంద్రబాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తోంది. దీని వెనక ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. 2011 ఏప్రిల్ నుంచి శ్రీనివాసరాజు టీటీడీ జెఈవోగా కొనసాగుతున్నారు. తాజాగా చంద్రబాబు సర్కారు మరో రెండేళ్లు ఆయన్ను అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన టీటీడీ వంటి చోట ఒకే వ్యక్తిని తొమ్మిదేళ్ళు కొన సాగించటం వెనక పలు బలమైన కారణాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేదంటే టీటీడీ జెఈవోగా నియమించేందుకు శ్రీనివాసరాజుకు మించిన సమర్ధులు తమ ప్రభుత్వంలో ఎవరూ లేరని చంద్రబాబు భావిస్తున్నారా?.