విజయసాయిరెడ్డి..రమణదీక్షితులకు టీటీడీ లీగల్ నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివాదం కొత్త మలుపు తిరిగింది. అంతా సద్దుమణిగింది అనుకున్న తరుణంలో టీటీడీ బోర్డు లీగల్ నోటీసులు పంపిన వ్యవహారంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు అయింది. గత కొన్ని రోజులుగా ఎన్నడూలేని రీతిలో టీటీడీలో పాలన సాగుతున్న తీరు వివాదస్పదం అవుతోంది. ఇటీవల వరకూ దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు లీగల్ నోటీసులు పంపింది. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. గత నెల 15న చెన్నయ్ లో రమణదీక్షితులు టీటీడీతో పాటు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీటీడీ పోటులో తవ్వకాలు జరిగాయని, నేలమాలిగలను తరలించి సీఎం నివాసంలో దాచారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు గానీ, సీబీఐ గానీ చంద్రబాబు ఇంటిపై దాడులు నిర్వహిస్తే నగలు బయట పడతాయంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈనెల5న జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై కూలంకశంగా చర్చించి వీరిరువురికీ మొదటి దశగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి పోస్టు ద్వారా టీటీడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి కనుక నోటీసులకు స్పందించకుండా..విచారణకు డిమాండ్ చేస్తే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.