Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ‘ఢిల్లీ’ కలకలం

టీడీపీలో ‘ఢిల్లీ’ కలకలం
X

తెలుగుదేశం పార్టీ మాట్లాడితే ఉలిక్కిపడుతోంది. ఎవరు...ఎవరితో కలసినా వణికిపోతోంది. ఇప్పుడు అదే సీన్. వైసీపీ ఎమ్మెల్యే..పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఢిల్లీలో బిజెపి నేతలను కలవటంతో టీడీపీలో సరికొత్త ఆందోళన మొదలైంది. పీఏసీ ఛైర్మన్ కు ప్రభుత్వంలో జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే బిజెపి నేతలను కలసిన బుగ్గన ఏపీ ప్రభుత్వంలో....ముఖ్యంగా చంద్రబాబు అండ్ కో అక్రమాలు..అవినీతికి సంబంధించిన వివరాలు అందజేసినట్లు సమాచారం. బిజెపి నేతలతో కలసి బుగ్గన కారులో తిరిగిన వీడియో ఒకటి వెలుగులోకి రావటంతో తెలుగుదేశం పార్టీ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. బిజెపి, వైసీపీ కలసి కుట్రలు చేస్తున్నారనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని టీడీపీ నేతలు ‘రాజకీయ దాడి’ ప్రారంభించారు. వైసీపీ, బిజెపి కుమ్మక్కు అని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని...దీనికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ తరుణంలో వైసీపీ నేతలు బిజెపి నేతలతో కలసి తిరగటం ఓ రకంగా చెప్పాలంటే సాహసమే.

ఎందుకంటే ఓ వైపు టీడీపీ భారీ ఎత్తున ఇద్దరూ కుమ్మక్కు అయి రాజకీయాలు చేస్తున్నారని బలంగా ప్రచారం చేస్తోంది. అయినా సరే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అలా బిజెపి నేతలతో ఢిల్లీలో కలసి తిరిగారంటే దీని వెనక బలమైన కారణాలే ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సహజంగా వైసీపీ నేతలకు ఇది రాజకీయంగా మైనసే. అయినా సరే సిద్ధపడ్డారంటే చంద్రబాబు త్వరలోనే చిక్కుల్లో పడబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నా..రకరకాల కారణాలతో ఇది జాప్యం అవుతూ వస్తోంది. చూడాలి మరి బిజెపి యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో. టీడీపీ ఉలికిపాటు చూస్తుంటే ఏదో జరగటం ఖాయంగా కన్పిస్తోంది.అమిత్ షాతో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి భేటీ అవ్వటాన్ని టీడీపీ మంత్రులు తప్పుపడుతున్నారు. అయితే బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాత్రం అమిత్ షా, రామ్ మాధవ్ లతో భేటీ పూర్తిగా అవాస్తవం అని ప్రకటించారు. ఏపీ భవన్ లో తాము కలసిన మాట వాస్తవమే అన్నారు.

Next Story
Share it