Telugu Gateway
Andhra Pradesh

సీఎం రమేష్ దీక్ష..సమాధానంలేని ప్రశ్నలెన్నో!

సీఎం రమేష్ దీక్ష..సమాధానంలేని ప్రశ్నలెన్నో!
X

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గత 11 రోజులుగా దీక్ష చేస్తున్నారు. రమేష్ తోపాటు టీడీపీ ఎమ్మెల్సీ బీ టెక్ రవి కూడా దీక్షకు కూర్చున్నారు. అయితే ఈ దీక్షపై రకరకాల వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అధికారంలో ఉన్న నేతలు దీక్షకు కూర్చోవటమే ఓ వింత. అధికారంలో ఉండి..నిన్న మొన్నటివరకూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్రంపై ఏ మాత్రం ఒత్తిడి చేయని చంద్రబాబు సర్కారు..ఇప్పుడు మాత్రం ‘పోరాటం’ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. అయితే సీఎం రమేష్ దీక్ష విషయంలో టీడీపీ నేతల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..

  1. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీ టెక్ రవి ఇద్దరూ ఒకే రోజు దీక్ష ప్రారంభించారు.
  2. మూడు రోజుల క్రితమే బీ టెక్ రవిని మాత్రం ఆస్పత్రికి తరలించారు. కానీ సీఎం రమేష్ మాత్రం అలా దీక్ష ‘చేస్తూనే’ ఉన్నారు.
  3. దీక్షతో బిటెక్ ఆరోగ్యం క్షీణిస్తే..మరి సీఎం రమేష్ మూడు రోజుల తర్వాత కూడా ఎలా దీక్ష చేయగలుగుతారు?.
  4. ఏభై మూడు సంవత్సరాల వయస్సులో ఓ వ్యక్తి ఏకంగా 11 రోజులు దీక్ష చేయటం సాధ్యం అవుతుందా?.
  5. ఎంత ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తూ మనిషి బాడీ ఉక్కుగా మారదు కదా?
  6. బీటెక్ రవి ఒకలా...సీఎం రమేష్ మరోలా దీక్ష చేశారా?
  7. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు కడప పర్యటన కోసమే సీఎం రమేష్ ‘దీక్షను పొడిగిస్తున్నారా?’.
  8. చంద్రబాబు పర్యటన పూర్తి కాగానే సీఎం రమేష్ దీక్షను భగ్నం చేసే అవకాశం ఉందా?. అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. రాజకీయ మైలేజ్ కోసమే ఇదంతా ఒక పథకం ప్రకారం చేయాలని నిర్ణయించటం వల్లే..ఎంపీలు కూడా ఢిల్లీలో సొంత పార్టీ ఎంపీ దీక్షపై బరువు తగ్గటానికి దీక్షలు అంటూ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సీఎం రమేష్ ఇలా ఏకబిగిన 11 రోజులు దీక్ష చేస్తున్నానని చెప్పటం వల్ల రావాల్సిన మైలేజ్ కంటే...సామాన్య ప్రజల్లో కూడా ఇలా చేయటం సాధ్యం అవుతుందా? అన్న జరుగుతోంది. ఈ పరిణామాలతో టీడీపీకి ఎంత ప్రయోజనం కలుగుతుందో చెప్పటం కష్టం కానీ..నష్టం మాత్రం ఖాయం అని అంటున్నారు.

Next Story
Share it