వైసీపీ కంటే ఎక్కువ రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ
తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీని మించి టీడీపీ నేతలు రాష్ట్రాన్ని చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఇసుక మాఫియాకు మాత్రమే పనికొచ్చిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం అంటే లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వటం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు తన కుటుంబం అని..నిరాదరణకు గురైన ప్రజల పక్షాన తాను ఉంటానని తెలిపారు. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే తప్పకుండా నిలదీస్తానని అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో పోటీచేస్తే వైసీపీ అధికారంలోకి వస్తుందని..వాళ్ళు వస్తే భూకబ్జాలు, అవినీతి పెరిగిపోతుందని భయపడ్డాను. అందుకే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. తీరా టీడీపీ నేతలు దోపిడీలో, అవినీతిలో వైసీపీ నేతలను మించిపోయారని స్పష్టం చేశారు. చంద్రబాబు తన దగ్గరకు వచ్చి మద్దతు అడిగితేనే వారికి అండగా నిలబడ్డాను. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి చేస్తారని ఆశించాను. నిరాదరణకు గురైన వీరి పక్షమే ఉంటాను తప్ప...అమరావతి పక్షం ఉండమంటారా? అని ప్రశ్నించారు. తప్పుచేస్తే జనసేన తప్పకుండా నిలదీస్తుందని అన్నారు. ఉచిత ఇసుక టీడీపీ ఎమ్మెల్యేల చట్టబద్ద దోపిడీకి ఉపయోగపడుతుందని ధ్వజమెత్తారు.