Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ప్రభుత్వాన్ని ‘హేరిటేజ్’లాగా మార్చేసిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వాన్ని ‘హేరిటేజ్’లాగా మార్చేసిన చంద్రబాబు
X

అక్కడ పాల వ్యాపారంతో డబ్బులు సంపాదించటం. ఇక్కడ పదవిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించటం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబుల్ ధమాకాలా అయింది పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ‘హెరిటేజ్ కంపెనీ’లాగా మారిపోయిందా?. ఆయన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటానికి ఆయన ముఖ్యమంత్రా లేక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరక్టరా?. లిస్టెడ్ కంపెనీల్లోనూ ఇంత అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటానికి ఛాన్స్ ఉండదు. అక్కడ వాటాదారులకు...బోర్డు డైరక్టర్లకు, నియంత్రణా సంస్థలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు ఏది అనుకుంటే అదే. ఏపీ ప్రభుత్వం-సింగపూర్ సంస్థల మధ్య డీల్ ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ అతి పెద్ద కుంభకోణంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మౌలికసదుపాయాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో అత్యంత కీలకమైన న్యాయ, ఆర్థిక శాఖ అభ్యంతరాలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సింగపూర్ సంస్థలకు దోచిపెడుతూ...విదేశీ సంస్థల ముందు సాగిలపడుతున్నారు. ఊరికే ఎవరూ ఆ పని చేయరు. ఏదో ప్రయోజనం ఉంటే తప్ప. ఉదాహరణకు అమరావతిలో సింగపూర్ సంస్థలకు కేటాయించే 1691 ఎకరాల భూమిని కారుచౌకగా అంటే అన్నీ కలుపుకున్నా ఎకరా ధర 20 లక్షల రూపాయలకు కూడా మించదు. ఆ భూమి మొత్తానికి ప్రభుత్వమే అన్ని మౌలికసదుపాయాలు కల్పిస్తుంది. అంతే కాదు ఈ భూమికి సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఇఛ్చింది. ఇందులో అడ్డగోలు ఉల్లంఘనలు ఎన్నో. వేలంలో స్టార్ హోటళ్ళకు కోటి..రెండు కోట్ల రూపాయలకు స్థలాలు కేటాయించిన ఏపీ సర్కారు ఒక్క సింగపూర్ సంస్థలకు మాత్రమే లక్షలకు భూమి ఇవ్వటం వెనక అవినీతి కాక మతలబు ఏమిటి?. సింగపూర్ ఏది కోరితే అదే అన్నట్లు ఒప్పందాలను అడ్డగోలుగా మార్చేశారు. లక్షల్లో దక్కించుకున్న ఈ భూమిని సింగపూర్ సంస్థలు నాలుగు కోట్ల రూపాయలకుపైనే అమ్మాలట. భారీ మొత్తంలో దక్కుతున్న లాభం ఎవరి పరం అవుతుంది. మొదట రాయితీ ఒప్పందం సింగపూర్ సంస్థలతో చేసుకోగా..ఇప్పుడు ఈ ఒప్పందంలో కూడా మార్పులు చేశారు. స్టార్టప్ ఏరియా చేపట్టేందుకు తొలుత ముందుకొచ్చిన ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రపొనెంట్ (ఓపిపి)తో కాకుండా ఇప్పుడు సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ (ఎస్ఏఐహెచ్)ను తెరపైకి తెచ్చారు.

ఈ కంపెనీని కూడా సింగపూర్ లో రిజిస్టర్ చేయించారు. అమరావతిలో భూమి ఇఛ్చి..అమరావతిలో రాయితీలు ఇచ్చి...ఏపీ ప్రజల డబ్బులు పెట్టి మౌలికసదుపాయాలు కల్పించి..వ్యాపారం చేయటానికి ఏపీ సర్కారు సింగపూర్ కంపెనీలతో కలసి భాగస్వామి కావాల్సిన అవసరం ఏముంది?. మొదటి నుంచి చంద్రబాబు సింగపూర్ సంస్థలు రాజధాని కడుతున్నాయని ఏపీ ప్రజలను మోసం చేశారు. తీరా ఈ సంస్థల ముందు అంతగా ఎందుకు సాగిలపడాలి అంటే...విదేశాల్లో డబ్బు మార్పిడి కోసమేనా?. అనే అనుమానాలు అదికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పోనీ ఈ సింగపూర్ సంస్థలు ఏమైనా అద్భుతాలు చేస్తాయా? అంటే అదీలేదు. అందమైన భవంతులు కట్టి అమ్ముకుంటాయి. ఆ అమ్ముకున్న డబ్బును తీసుకుని చెక్కేస్తాయి. అంతే కాదు..విడిగా స్థలాలు కూడా అమ్ముకుంటాయి. ఆ పని ప్రభుత్వం చేయలేదా?. స్థానిక కంపెనీ లు చేయలేవా?. అమరావతి-సింగపూర్ డీల్ చంద్రబాబు చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా మిగలటం ఖాయంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శలు చేయటం కాదు..మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి అని సవాళ్ళు విసురుతున్నారు. సవాళ్ళు సరే..ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఏమి చెబుతారు. అధికారంలో చేతిలో ఉంటే అడ్డగోలుగా ఏమైనా చేసుకోవటానికి లైసెన్స్ ఇచ్చినట్లా?.

Next Story
Share it