Telugu Gateway
Andhra Pradesh

ఒక్క ఛానల్ కవరేజ్ కోసం 25 లక్షలా?

ఒక్క ఛానల్ కవరేజ్ కోసం 25 లక్షలా?
X

ఎంత దోపిడీ చేస్తే ఇంతలా ఇవ్వగలరు?. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక అధికార పార్టీ ఎంపీ ఇంత భారీ మొత్తం ఆఫర్ చేశారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక ఎన్నికల సమయంలో ఈ ఖర్చు ఎన్ని కోట్లు ఉంటుందో చెప్పటం కష్టమే. పని చేసి ప్రజల ఆమోదంతో ఎన్నికల్లో గెలవటం కంటే...లేనిది ఉన్నట్లు చూపించటం...ఉన్నది లేనట్లు చూపించటం ద్వారా డబ్బుతో ప్రచారం చేసుకుని బయటపడాలనే ప్లాన్ వేయటం లో ఆ పార్టీ దిట్ట. ఓ అధికార పార్టీ ఎంపీ ఇఛ్చిన ఆఫర్ ఇప్పుడు ఆ ఛానల్ లో పెద్ద చిచ్చు రేపింది. తన కార్యక్రమం కవరేజ్ కోసం ఆ ఎంపీ యాజమాన్యానికి 25 లక్షలు ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ యాజమాన్యం మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించింది. అయితే మధ్యలో ఛానల్ సీఈవో ఓ మధ్యవర్తి ద్వారా ఎంపీ నుంచి పది లక్షల రూపాయలు తెప్పించుకున్నారు. పాతిక ఇస్తానంటే వద్దని..పది లక్షల రూపాయలు తీసుకోవటం ఏమిటని సదరు ఎంపీ ఛానల్ యాజమానితో మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే ఎంపీ నుంచి పది లక్షల రూపాయలు తెచ్చిన మధ్యవర్తిని హుటాహుటిన హైదరాబాద్ పిలిపించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కటంతో పది లక్షల రూపాయలు తెప్పించుకున్న ఆ సీఈవో ఈ మొత్తాన్ని వెనక్కి ఇఛ్చేయాల్సి వచ్చింది.

ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లోనూ.. ఆ ఛానల్ లోనూ పెద్ద సంచలనంగా మారింది. కేవలం ఓ కీలక ఛానల్ కు ఎంపీనే 25 లక్షల రూపాయలు ఆఫర్ చేశారంటే ..ఇతర ముఖ్య నేతల సమావేశాలు కూడా ఇలా ప్యాకేజీల కిందే ప్రసారం అవుతున్నాయా? అనే అనుమానం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఛానల్ యాజమాన్యం తప్పు చేసిన సీఈవోను వదిలేసి...ఆయన చెప్పిన పని చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేసి...శిక్షించటం కూడా పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే పలు ఛానల్స్ ‘ప్యాకేజీ’ల ప్రకారమే ముందుకు సాగుతున్నాయనే ప్రచారం ఉంది. వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీలు మరింత పెరిగే అవకాశం ఉందని..ఇందుకు ఓ ఎంపీ తన కోటా కింద కేవలం ఒక్క ఛానల్ కు 25 లక్షల రూపాయలు ఆఫర్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it