Telugu Gateway
Andhra Pradesh

పవన్...ఏపీలో ఇసుక దోపిడీకీ మోడీనే తిట్టు

పవన్...ఏపీలో ఇసుక దోపిడీకీ మోడీనే తిట్టు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏదైనా ఉంటే మోడీని తిట్టండి. నన్ను ఎందుకు తిడతారు?. ఈ మాట పదే పదే చెబుతారు. రాష్ట్రం కోసం తానెంతో కష్టపడుతుంటే నన్ను తిడతారా? అని ప్రశ్నిస్తారు. అస్మదీయ మీడియా కూడా ఇప్పుడు అచ్చం అదే చెబుతోంది. ఏపీలో ఇసుక మాఫియాకు కారణమైనందుకు ప్రధాని మోడీనే తిట్టాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సరైన రోడ్లు సరిగా లేనందుకు...అమరావతిపై పెడుతున్నానని చెబుతున్న శ్రద్ద కొద్దిగా అయినా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై పెట్టనందుకు, సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయలు అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నందుకు మోడీనే తిట్టాలి. పట్టిసీమ స్కామ్ కూ మోడీనే తిట్టాలి. సింగపూర్ సంస్థల కోసం ఏపీ చట్టాలను పూర్తిగా మార్చి...వాళ్ళు ఏమి అడిగితే అది చేసి..రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టుపెట్టినందుకు మోడీనే తిట్టాలి. అమరావతిలో రోడ్డు పనులు....భవనాల పనులను ముందే ఎవరికి ఏది కేటాయించాలో నిర్ణయించి..వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నందుకు మోడీనే తిట్టాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇఛ్చినా తనకు కమిషన్లు రావని ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దక్కిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రద్దు చేసిన కారణంగా మోడీనే తిట్టాలి.

విభజనతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం లేకుండా పోయిన ఏపీకి అన్ని అనుమతులు వచ్చినా దోపిడీకి అనువుగా లేదని..అధికారులు ఏఏఐకే ప్రాజెక్టు ఇవ్వాలంటూ సిఫారసు చేసినా కేబినెట్ ముందు పెట్టి మరీ టెండర్ రద్దు చేసింది మోడీ కాక మరెవరు?. ఇలా ఏపీకి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం రాకుండా అడ్డుకున్నందుకు మోడీనే టార్గెట్ చేయాలి. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు పది ఎకరాలు చాలు అని సాక్ష్యాత్తూ పరిపాలనకు ప్రధాన మార్గనిర్దేశకుడు అయిన చీఫ్ సెక్రటరీ లిఖితపూర్వకంగా చెప్పినా సరే...ఓ భారీ కుంభకోణానికి తెరలేపుతూ ఏకంగా నలభై ఎకరాలు కేటాయించి స్కాం చేసినందుకు ఖచ్చితంగా మోడీని తిట్టాల్సిందే. నీరు-చెట్టులో అడ్డగోలు దోపిడీ చేసినందుకు, సోలార్ ప్రాజెక్టుల విద్యుత్ ఒప్పందాలకు, పారిశ్రామిక రాయితీల గోల్ మాల్ కు ఇలా చంద్రబాబు సారధ్యంలో నడిచే స్కామ్ లు అన్నింటికి ఎవరైనా సరే మోడీనే తిట్టాలి. చంద్రబాబును ఎవరూ ఏమీ అనకూడదు.

ఎందుకంటే ఆయన ‘నిప్పు’ కదా?. ప్రత్యేక హోదా విషయంలో హామీ ఇఛ్చిన మోడీ ఏపీకి హ్యాండ్ ఇచ్చిన మాట నిజమే. అదే సమయంలో విజభన హామీల్లో చాలా అమలు కాలేదు కూడా. కానీ చంద్రబాబు తీరు ఎలా ఉందంటే ఏపీలో తాను చేసే స్కామ్ లకూ మోడీదే బాధ్యత ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే ఎవరేమి మాట్లాడినా..మోడీని కదా తిట్టాల్సింది నన్ను తిడతారా? అంటూ తన తప్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీడియా మద్దతు కూడా పుష్కలం. ఇంకేమి కావాలి..తనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అంతా మోడీకి ట్రాన్స్ పర్ చేయాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. అదే ప్లాన్...నన్ను తిడతారా? కాన్సెప్ట్. కుట్రలు తాను చేయాలి తప్ప...ఇతరులు చేస్తే సహించకూడదు అనే చంద్రబాబు కాన్సెప్ట్. చూడాలి మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో?

Next Story
Share it