Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ‘పోరాటయాత్ర’ పయనమెటు!

పవన్ కళ్యాణ్ ‘పోరాటయాత్ర’ పయనమెటు!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇంకా సీరియస్ రాజకీయాలు నేర్చుకోవటం లేదా?. ఉత్తరాంధ్రలో వరస పెట్టి 45 రోజులు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్న పవన్ తన పర్యటనకు బ్రేకుల మీద బ్రేకులు వేస్తున్నారు. దీంతో పవన్ రాజకీయాలపై మరోసారి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పర్యటనలో ఉండగానే కొన్ని రోజులు ‘ఫాం హౌస్‘కు పరిమితం అయిపోయారు. తర్వాత ఓ రెండు రోజుల పాటు కొనసాగించి తన భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది మైనారిటీలు ఉన్నారని చెప్పి ‘రంజాన్’ సెలవులు ప్రకటించేశారు. రంజాన్ అయిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ తన యాత్ర మళ్ళీ ఎప్పటి నుంచో ప్రారంభం అవుతుందో ఇంతవరకూ ప్రకటించలేదు. ప్రజాపోరాట యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు సూటిగా..స్పష్టంగానే చేశారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇది సాధ్యమైంది కూడా. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గతంలో విమర్శించినట్లు ఇంటర్వెల్స్ ఎక్కువ సినిమా తక్కువ అన్న చందంగా రాజకీయాలు చేస్తే ముందుకు సాగటం కష్టం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

పైగా సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోనే జరగటం పక్కా అనే అభిప్రాయం బలంగా ఉంది. అంటే ఇంకా ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. మరి పవన్ రాష్ట్రంలో తన పర్యటనను ఎప్పుడు పూర్తి చేసుకుంటారు. 175 సీట్లలో అభ్యర్ధుల ఖరారు ఎప్పుడు పూర్తి చేస్తారు. ఈ సారైనా పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలో నిలబెట్టగలిగే పరిస్థితికి చేరుకుంటారా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన ఆవిర్భావ సభ సమయంలో కేడర్ కు ఇచ్చిన ‘కిక్’ను కంటిన్యూ చేయటంలో పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ తన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉన్న నాయకులను ఆకర్షించటంలో కూడా ఇంత వరకూ సక్సెస్ కాలేదు.

Next Story
Share it