నేను రెచ్చగొడితే చంద్రబాబు రోడ్లపై తిరగగలరా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నవనిర్మాణ దీక్షలో మాట్లాడిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ నేను ప్రజల్ని రెచ్చగొడుతున్నానని చెబుతున్నారు. నేను ప్రజలకు వాస్తవాలు చెబుతున్నా. నేను రెచ్చగొట్టడం మొదలుపెడితే చంద్రబాబు రోడ్లపై తిరగగలరా?.’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతల అవినీతిపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని..ప్రస్తుతం ప్రజలకు వాస్తవాలు మాత్రమే చెబుతున్నానని..ఇంకా రెచ్చగొట్టడం ప్రారంభించలేదని వ్యాఖ్యానించారు. అదే మొదలైతే పరిస్థితి వేరుగా ఉంటుందని అన్నారు. తానెంతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని..కానీ తనకు ఎక్కడా అది కన్పించటం లేదన్నారు. అభివృద్ధి అంటే..టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల అభివృద్ధి అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. దోపిడీ ఇలాగే కొనసాగితే టీడీపీ నేతలను రోడ్ల మీద కూడా తిరగనీయమని..రెచ్చగొట్టడం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుందని అన్నారు. భోగాపురం విమానాశ్రయం పేరుతో రైతులను రోడ్డున పడేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
భోగాపురం విమానాశ్రయం దగ్గర భూములు కొన్న తెలుగుదేశం వాళ్ల జాబితా బయటపెడుతామన్నారు. చంద్రబాబు విజన్ 2020తో ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలైంది. ఇప్పుడు 2050 గురించి మాట్లాడుతున్నారు. అప్పటికి రాష్ట్రంలో ఇక్కడా నదుల్లో నీళ్లు, ఇసుక ఉండవు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఇసుక దోచేస్తున్నారు. చంద్రబాబు పరిపాలనా చేస్తున్నారా? ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తున్నారా?. పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నవనిర్మాణ దీక్షలకు 13 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ సొమ్ముతో భోగాపురం చుట్టుపక్కల మత్సకారులకు జెట్టీలు కట్టించొచ్చు.సచివాలయంలో కూర్చుని చంద్రబాబు 17 వేల కిలోమీటర్ల రోడ్లు వేశా అని చెబుతున్నారు. భోగాపురం వచ్చి చూడండి ఈ రోడ్డు ఎన్ని గుంటలు..కంకర తేలి ఉందో కనపడుతుంది అని తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర నాయకులు ఎవరూ వలసపోరు..ప్రజలే ఉపాధి కోసం పోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఏ నాయకుడు స్థానిక సమస్యలు పట్టించుకోవటం లేదన్నారు.