పవన్ మరో గందరగోళ ప్రకటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఓ గందరగోళ ప్రకటన విడుదల చేశారు. ఆయన ట్విట్టర్ లో ఓ కామెంట్ పెడుతూ ‘2014 ఎన్నికలలో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించాం , 2019 ఎన్నికలలో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో మద్దతు అనేది ముగిసిన అధ్యాయం. అయితే 2019 ఎన్నికల్లో సమతుల్యత కోసం పోటీచేయటం ఏమిటి?. పోటీలో సమతుల్యత ఏమి ఉంటుంది. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పి ఓట్లు అడుగుతాయి.
అదే సమయంలో అధికార పార్టీ చేసిన తప్పులను ఎత్తిచూపుతాయి. అంతే కానీ ఎన్నికల బరిలో నిలవటంలో సమతుల్యత ఏమి ఉంటుంది?. అంటే అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కులాల వారీగా సమతుల్యత పాటిస్తామని చెప్పదలచుకున్నారా? లేక ప్రాంతాల వారీ అభివృద్ధిలో సమతుల్యత గురించి చెప్పాలనుకున్నారా?. అదేమీ చెప్పకుండా ఎన్నికల్లో పోటీ విషయంలో సమతుల్యత అంటే ఏమిటో జనసేనానికే తెలియాలి?.