బిజెపికి మరో షాక్

దేశంలో బిజెపికి కష్టకాలం మొదలైనట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో అన్నీ ప్రతికూల ఫలితాలే. 2014 ఎన్నికల తర్వాత ఇటీవల వరకూ అప్రతిహతంగా ముందుకు సాగిన బిజెపికి గత కొన్ని రోజులుగా ఎదురుదెబ్బలు తగలటం ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కూడా బిజెపికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీకి బుధవారం నాడు మరో షాక్ తగిలింది. జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బిజెపి అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానానికి జూన్ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికలో బీజేపీ తరపున దివంగత విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ గెలుపు సులవు అయింది. జయనగర్ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇది బిజెపికి మరో దెబ్బగానే చెప్పుకోవాలి.