Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ..ఏపీలకు కేంద్రం షాక్

తెలంగాణ..ఏపీలకు కేంద్రం షాక్
X

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీతో పాటు తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టీల్ ప్లాంట్స్ పై కేంద్రం నీళ్ళు జల్లింది. తెలంగాణాలోని బయ్యారంతోపాటు ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్ ల ఏర్పాటు సాధ్యంకాదని కేంద్రం తేల్చేసింది. విభజన చట్టంలో ఆయా ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇఛ్చింది. ముఖ్యంగా విభజనతో ఎక్కువ నష్టపోయిన ఏపీ పలు అంశాలపై కేంద్రం తీరుతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తేల్చేశారు. ఇది రెండు రాష్ట్రాల్లో బిజెపిపై మరింత వ్యతిరేకత పెరగటానికి కారణమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విభజన చట్టంలోని అంశాల అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు.

దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ అందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో కేవలం కర్మాగారాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించమని మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఉక్కు కర్మాగారాల ఏర్పాటు 2014లోనే సాధ్యం కాదని స్పష్టంగా చెప్పామని కేంద్రం పేర్కొంది. అయినా ఆయా రాష్ట్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచనలు చేశాయని తెలిపింది. సాధ్యాసాధ్యాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఆ మేరకు రాష్ట్రాలిచ్చిన నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కినట్లే కన్పిస్తోంది.

Next Story
Share it